వాలంటీర్... సరికొత్త వ్యూహంలో వైసీపీ..!?

వాలంటీర్లు వైసీపీ అభ్యర్ధుల వెనక తిరుగుతున్నారని ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు అని ఆరోపిస్తోంది.

Update: 2024-03-24 01:30 GMT

ఏపీలో వాలంటీర్ల చుట్టూనే రాజకీయం మొత్తం తిరుగుతోంది. వాలంటీర్లను వైసీపీ తన రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటోంది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినది లగాయితూ ప్రతీ రోజూ వాలంటీర్ల మీద ఈసీకి ఫిర్యాదులు వెల్లువలా వెళ్తున్నాయి. వాలంటీర్లు వైసీపీ అభ్యర్ధుల వెనక తిరుగుతున్నారని ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు అని ఆరోపిస్తోంది.

ఇప్పటికి వారం రోజులుగా చూస్తే వివిధ జిల్లాల వారీగా వాలంటీర్లను తొలగిస్తూ ఈసీ చర్యలు తీసుకుంటోంది. దీని వల్ల వందలాది మంది ఉద్యోగం కోల్పోయారు. వాలంటీర్లను ఎన్నికల వేళకు ఆయుధంగా చేసుకుందామన్న వైసీపీ వ్యూహం అలా బెడిసికొట్టింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వాలంటీర్లకు ప్రజలతో నేరుగా కనెక్షన్ ఉంది. ప్రతీ యాభై కుటుంబాలకు వారు అనుసంధానం అయ్యారు. దాంతో వాలంటీర్లను ఇపుడు వేరే విధంగా వాడుకోవాలని వైసీపీ నిర్ణయించిందని అంటున్నారు. ఎటూ ఉద్యోగాలు కోల్పోయిన వారు వైసీపీతోనే ఉంటారు. వారితో కలసి ప్రచారంలో పాల్గొంటారు.

వీరు కాకుండా చురుకైన వారు దూకుడు కలిగిన వారిని ఎక్కడికక్కడ ఎంపిక చేసి వారిని కోరి రాజీనామాలు చేయించాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. వారు ఉద్యోగం వదిలేస్తే వారు ఫ్రీ బర్డ్స్ అవుతారు. అపుడు వారి సేవలను రాజకీయాలకు వాడుకోవచ్చు అని భావిస్తోంది. అదే విధంగా వారిని పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాడుకోవడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

వాలంటీర్ల విషయంలో వైసీపీ ఇపుడు సరికొత్త వ్యూహంతో ఉంది అని అంటున్నారు. ఇక వాలంటీర్ల సేవలు లేని చోట్ల వారి ఉద్యోగాలు పోయిన చోట విపక్షాల వల్లనే ఇలా జరుగుతోందని చెబుతూ లబ్దిదారులకు నేరుగా సేవలు అందకుండా చేస్తున్నారు అని ఏదురు దాడికి దిగేందుకు కూడా వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు.

ఇదిలా ఉండగా వాలంటీర్లను పూర్తిగా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఓటర్ల వివరాలతో పాటు వారితో నేరుగా అనుబంధం వాలంటీర్లకే ఉందని అందుకే వారికి దూరం పెట్టాల్సిందే అని ఆయన కోరుతున్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. తిరుపతి లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆయన కోరుతున్నారు.

Tags:    

Similar News