పరమగురుడు చెప్పిన వాడు.. `పెద్ద` మనిషి కాడురా!
``పరమగురుడు చెప్పిన వాడు.. పెద్దమనిషి కాడురా.. పెద్దమనిషి అంటేనే బుద్ధులన్ని వేరురా..`` అని పాడుకునే సమయం వైసీపీలో ఆసన్నమైంది.
``పరమగురుడు చెప్పిన వాడు.. పెద్దమనిషి కాడురా.. పెద్దమనిషి అంటేనే బుద్ధులన్ని వేరురా..`` అని పాడుకునే సమయం వైసీపీలో ఆసన్నమైంది. వైసీపీకి చెందిన పెద్దల(రాజ్య)సభ సభ్యుల వ్యవహారం.. రోజు రోజుకు చర్చగా మారుతోంది. ఆ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్న విషయం తెలిసిందే. దీనినే వైసీపీ ముఖ్య నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. టీడీపీకి లోక్‌సభలో 16 మంది ఎంపీలు ఉంటే.. మాకు రాజ్యసభలో 11 మంది, లోక్‌సభలో నలుగురు ఉన్నారని చెప్పారు.
అయితే.. పరిస్థితి ఇప్పుడు సాయిరెడ్డి అనుకున్నట్టుగా అయితే లేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఆయారాం.. గయారాం.. అన్నట్టుగా ఉన్న నాయకులే ఇప్పుడు 11 మందిలో 6 నుంచి ఏడుగురు వరకు ఉన్నారనేది ఒక లెక్క. ఆర్. కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోశ్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వానీ(కేంద్రం కోటా అంటారు), గొల్ల బాబూరావు(ఎస్సీ) వంటివారు.. ఏ ఎండకు ఆ గొడుగు పడతారనే విషయంలో సందేహం లేదు.
తమ వ్యాపారాలకు ఇబ్బంది వస్తే.. నత్వానీ, తనపై కేసులు తిరగదోడితే మోపిదేవి.. ఏదైనా పదవో, డబ్బో ఇస్తానంటే మిగిలిన వారు జంప్ చేసేందుకు రెడీనే. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. మరో ఆరు మాసాలకైనా వారి మనసు మారే అవకాశం మెండుగానే ఉంది. ఇక, సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటివారు పార్టీలోనే ఉంటారు. మిగిలిన వారిపై మాత్రం నీలినీడలు కమ్ముకునే ఉన్నాయి. ఏ క్షణంలో అయినా.. వారు మనసు మార్చుకుంటే.. పెద్దల సభలో మార్పులు తప్పవు.
టీడీపీలోకి కాకుండా.. బీజేపీలోకి వెళ్తే.. వైసీపీకి ఉభయ కుశలోపరిగా మేలు జరుగుతుందన్నది కొందరి ఉద్దేశంగా ఉందని అంటున్నారు. గతంలో టీడీపీ కూడా ఇదే పని చేసింది. కాబట్టి.. రేపు ఒకవేళ ఎంపీలు వెళ్లిపోవాలని అనుకుంటే.. బీజేపీవైపు వెళ్లేలా ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదని పరిశీలకుల అంచనా. ఏదేమైనా.. పరమగురుడు చెప్పిన వాడు పెద్దమనిషి కాడురా! అంటున్నారు పరిశీలకులు