ఎందుకు? స్పీకర్ ఎన్నికల వేళ బీజేపీకి జగన్ మద్దతు!

ఎందుకిలా? అంటే.. జగన్ ముందున్న పరిస్థితులే దీనికి కారణంగా చెప్పాలి.

Update: 2024-06-26 07:11 GMT

ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్ సభ స్పీకర్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి తమ మద్దతు ఇస్తున్నట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నసమాచారం ప్రకారం.. తన మద్దతును రాతపూర్వకంగా పంపినట్లు సమాచారం. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కూడిన కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఎన్నికల వేళలో కూటమిని అపహాస్యం చేసిన జగన్.. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం బీజేపీకి అన్ని అంశాల్లోనూ తన మద్దతును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.

ఎందుకిలా? అంటే.. జగన్ ముందున్న పరిస్థితులే దీనికి కారణంగా చెప్పాలి. కొత్తగా బయటకు వచ్చిన అంశం ఏమంటే.. స్పీకర్ ఎన్నిక అంశం మంగళవారం తెర మీదకు వచ్చింది. దానికి రెండు.. మూడు రోజుల ముందే కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కీలకపక్షమైన బీజేపీకి జగన్ లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. అంశాల వారీగా బయట నుంచి మోడీ సర్కారుకు మద్దతు పలికిన జగన్.. తాజాగా మాత్రం భేషరతుగా మద్దతు పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అక్రమాస్తుల కేసుతో పాటు.. తాము అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల్లో ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా వరుస పెట్టి అరెస్టులు చేయించటం.. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబును సైతం జైలుపాలు చేయటం తెలిసిందే. తమ ఐదేళ్ల పాలనలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని.. పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నింటికి మించిన తన బాబాయ్ కం మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించిన అంశాలు రానున్న రోజుల్లో కీలకం కానుందని చెబుతున్నారు.

తనకు ఎదురయ్యే ఇబ్బందుల్ని తట్టుకోవటానికి అవసరమైన అండ కోసం.. తనకు తానే ఎన్డీయేకు భేషరతుగా మద్దతు ఇస్తున్నట్లుగా లేఖ రాసినట్లు సమాచారం. కేసుల కష్టాల నుంచి గట్టెక్కేందుకు కేంద్రంలోని పెద్దల అండ తనకు అవసరమన్న ఉద్దేశంతోనే మద్దతు లేఖ రాసి ఉంటారని చెబుతున్నారు. లోక్ సభలో వైసీపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో తొమ్మిది మంది సభ్యులున్నారు. వీరి బలం ఎన్డీయేకు అవసరం అవుతుంది.

అందుకే.. కొన్ని అంశాల్లో అయినా తన బలంతో తనకు ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా మద్దతు లేఖ రాసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఓవైపు అధికారికంగా పొత్తు పెట్టుకున్న కూటమిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసే జగన్.. మరోవైపు అనధికారికంగా మద్దతు ఇచ్చే తీరును ప్రదర్శించటం జగన్ ప్రత్యేకతగా చెప్పాలి. అందుకే.. స్పీకర్ ఎన్నిక వేళ.. తన మద్దతు ఉంటుందని బీజేపీకి సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వ్యూహాత్మకంగా మద్దతు ప్రకటించే జగన్ తీరుపై మోడీ ఎలా రియాక్టు అవుతారన్నది చూడాలి.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు