అయ్యన్నని ఓడించాల్సిందే...!
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఓడించి తీరాలని వైసీపీ పట్టుదల మీద ఉంది.
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఓడించి తీరాలని వైసీపీ పట్టుదల మీద ఉంది. అయ్యన్నపాత్రుడు 2019 ఎన్నికల్లో పాతిక వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి పెట్ల ఉమాశంకర్ మీద నర్శీపట్నంలో ఓటమి చెందారు. గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన వైసీపీ మీద దారుణమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు అని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అయితే అనేక పర్యాయాలు అనుచితమైన వ్యాఖ్యలు చేసి అయ్యన్న వైసీపీ కన్నెర్రకు గురి అయ్యారు.
బాబు కళ్లలో ఆనందం చూడడం కోసం ఆయన నోరు చేసుకున్నారని అంటారు. ఈ కారణంగా ఆయన మీద పదిహేను దాకా కేసులు కూడా ఉన్నాయి. వ్యక్తిగత స్థాయిలో ఆయన సీఎం జగన్ మీద విమర్శలు చేయడాన్ని వైసీపీ అధినాయకత్వం తట్టుకోలేక పోయిన సందర్భాలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో అయ్యన్న అసెంబ్లీలో కనిపించకూడదు అన్న పంతంతో ఆ పార్టీ ఉంది. ఏడు పదులకు చేరువలో ఉన్న అయ్యన్నకు ఇవి దాదాపుగా చివరి ఎన్నికలు. ఈసారి ఆయన్ని ఓడిస్తే నర్శీపట్నంలో వైసీపీకి తిరుగు ఉండదని ఆ పార్టీ భావిస్తోంది. అయ్యన్నను ఓడించేందుకు అవసరం అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ని కూడా మార్చేందుకు వైసీపీ హై కమాండ్ చూస్తోంది అని తెలుస్తోంది.
అయ్యన్న తమ్ముడు సన్యాసిపాత్రుడు వైసీపీలో ఉన్నారు. ఆయన సతీమణి అనితకు మూడేళ్ళ పాటు డీసీసీబీ చైర్ పర్సన్ పదవిని ఇచ్చి పార్టీ గౌరవించింది. 2019 ఎన్నికల ముందు చేరిన సన్యాసిపాత్రుడు ఎమ్మెల్యే సీటు కోరుకుంటున్నారు. ఆయన్ని పోటీకి దించితే అన్న అయ్యన్నను సులువుగా ఓడిస్తారు అన్న లెక్కలు వేస్తోంది వైసీపీ హై కమాండ్. 2024 ఎన్నికల్లో నర్శీపట్నం వైపు అంతా చూస్తారు అని అంటున్నారు. అన్నదమ్ముల సవాల్ గా వేడిగా వాడిగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ మరోసారి గుర్రున తిరుగుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.