జగన్ మీద సీబీఐ...చెల్లెమ్మ డిమాండ్!
అయితే జగన్ మీద అని నేరుగా కాదు ఆయన ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద సీబీఐ విచారణను ఆమె కోరుకుంటున్నారు.
ఒకనాడు సీబీఐ జగన్ ని అరెస్ట్ చేస్తే జగనన్న విడిచిన బాణంగా జనంలోకి వచ్చి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సొంత చెల్లెమ్మ వైఎస్ షర్మిల ఇపుడు జగనన్న మీదనే సీబీఐ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జగన్ మీద అని నేరుగా కాదు ఆయన ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద సీబీఐ విచారణను ఆమె కోరుకుంటున్నారు.
అదానీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల మీదనే సీబీఐ విచారణకు ఏపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు గత వైసీపీ ప్రభుత్వం హడావుడిగా అర్ధరాత్రి అనుమతులు ఆ విద్యుత్ ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేవలం ఈ విద్యుత్ ఒప్పందాల విషయమే కాదు విశాఖ గంగవరం పోర్టుని అదానీ కంపెనీకి అప్పగించడం పట్ల కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని షర్మిల గట్టిగా కోరుతున్నారు. ఏకంగా ఏపీలో ఎన్నెన్ని వాటికి సంబంధించి అదానీ కంపెనీలకు జగన్ అనుమతులు ఇచ్చారు అన్న దాని మీద అగ్ర సంస్థలతో దర్యాఫ్తు జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ రాశారు.
ఇక అదానీతో మాజీ సీఎం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కూడా ఆమె ఆ లేఖలో కోరారు. అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెను భారం అన్నారు. ఇవన్నీ అక్రమ ఒప్పందాలే అని ఆమె అంటూ దాని వల్ల ఏకంగా పాతికేళ్ల పాటు ఏపీ ప్రజలపై లక్షన్నర కోట్ల రూపాయల భారం పడుతోందని అన్నారు. అందువల్ల తక్షణమే అదానీతో జరిగిన ఒప్పందాలను రద్దు చేసి, ఆ కంపెనీని ఏపీ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కూడా షర్మిల కోరడం విశేషం.
ఇదిలా ఉంటే అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశల సందర్భంగా కూడా అదానీ అంశం కీలకంగా మారి సభ వాయిదాకు దారి తీసింది. ఇక ఏపీలో అయితే జగన్ మీద అధికార విపక్ష పార్టీలు అన్నీ వేలెత్తి చూపుతున్నాయి.
ఒకనాడు ఆయన మంత్రివర్గంలో విద్యుత్ శాఖను చూసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం వైసీపీ ప్రభుత్వం నాడు తీసుకున్న నిర్ణయాలలో తన ప్రమేయం లేదని చెప్పారు. ప్రభుత్వమే నేరుగా తీసుకున్న డెసిషన్ అని అన్నారు
ఇపుడు షర్మిల అయితే సీబీఐ విచారణను కోరుతున్నారు. మొత్తం మీద జగన్ మీద షర్మిల సరైన సమయం చూసి బాణం వేశారని అంటున్నారు. అప్పుడు సీబీఐ విచారణ జరిగితే జగన్ వదిలిన షర్మిల బాణం ఇపుడు ఆయనకే ఎదురు తిరిగి ఆయన మీదనే రెండోసారి సీబీఐ ని వేయమని కోరుతున్నారు అంటే రాజకీయంగా ఇది వైరల్ అవుతోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అదానీ విషయంలో ఆందోళన చేస్తోంది. పీసీసీ చీఫ్ గా షర్మిల ఈ డిమాండ్ చేశారు అని అంటున్నారు. మరి దీని మీద టీడీపీ కూటమి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.