బంగారు పళ్ళెంలో జగన్ కి అధికారం అప్పగిస్తారా...!?
రాజకీయాల్లో ప్రజలు నిర్ణయాత్మక శక్తి అన్నది తెలిసిందే. అది ఎవరూ కాదనలేరు. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలతో వ్యవహరించాలి
రాజకీయాల్లో ప్రజలు నిర్ణయాత్మక శక్తి అన్నది తెలిసిందే. అది ఎవరూ కాదనలేరు. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలతో వ్యవహరించాలి. ఎన్నికల పరుగు పందెంలో దూకుడు చూపించాలి. ప్రజలకు చేరువ కావాలి. కానీ ఏపీలో విపక్షం అయితే డీలా పడి ఉంది అని అంటున్నారు. మరో పది రోజులలో ఏపీ అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి.
అయితే విపక్ష శిబిరంలో ఇంకా గందరగోళం అలాగే కొనసాగుతోంది. ఈ రోజుకు టీడీపీ జనసేనల మధ్య సీట్ల పంచాయతీ తేలడంలేదు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది క్లారిటీ లేదు. టీడీపీ జనసేన పొత్తు ఒక అనూహ్యమైనది అని అంతా అంటున్నదే. రెండు పార్టీలూ ప్రాంతీయ పార్టీలు. రెండు పార్టీల మద్దతుదారులూ తమ నాయకుడే సీఎం కావాలని కోరుకుంటున్నారు.
ఇక బలమైన కాపు సామాజికవర్గం సుదీర్ఘ కాలం ఆశలు అన్నీ పవన్ మీద పెట్టేశారు. పవర్ షేరింగ్ అంటున్నారు. మరి చంద్రబాబు దగ్గర ఇవన్నీ కుదిరేవి కావు. ఆయన ఎపుడూ మిత్ర పక్షాలకు పది పన్నెండు మించి సీట్లు విదిలించినది లేదు. మ్యాజిక్ ఫిగర్ కోసం టీడీపీ కచ్చితంగా 140 కి తగ్గకుండా సీట్లు పోటీ చేస్తుంది. ఇది కన్ ఫర్మ్.
మరి ఆ విషయం ఏదో బయటకు చెప్పి జనసేనకు పాతిక ముంచి ముప్పయి సీట్లు ఇస్తామని చెప్పి పొత్తు పంచాయతీని పరిష్కరించుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. రోజులు గడుస్తున్నాయి. ఇంకా అలా లేట్ చేసి నానబెట్టి చివరికి అభ్యర్ధులను ప్రకటించినా యుద్ధ కాండ రెండు పార్టీలలోనూ మొదలవుతుంది.
ఆ విషయం తెలిసినా చంద్రబాబు ఇంకా తన గత కాలం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారని అంటున్నారు. ఇక జనసేన అధినేత అయితే వారాహి యాత్రలకు విరామం ప్రకటించి మూడు నెలలు గడచాయి. ఆయన బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది. చంద్రబాబు జిల్లా పర్యటనలు చేస్తున్నా సీట్ల తగవులు ఆయనకు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. రాజమండ్రి సభలో అలాంటివి జరిగాయి కూడా.
ఇక్కడ ఒక మాట ఉంది. ఎన్ని సీట్లు జనసేనకు ఇస్తారు అన్నది టీడీపీ జనసేనల అధినాయకులకు ఇద్దరికీ తెలుసు అని. అయితే ముందే చెబితే ఇబ్బంది అని ఆలస్యం చేస్తున్నారు అని. మరి క్యాడర్ సహకరించాలి అంటే ముందే వారికి చెప్పేస్తేనే మంచిది. పార్టీ పట్ల విధేయతతో ఉన్న వారు ఉంటారు. లేని వారు బయటకు పోతారు.
ఈ శషబిషలు కొనసాగిస్తూ ఎన్నికల ముంగిట వరకూ గుప్పిట మూసి ఉంచితే అపుడు బడబాగ్ని చెలరేగితే ఎవరు బాధ్యులు అవుతారు అన్నది క్యాడర్ నుంచి వస్తున్న ప్రాశ్న. మంచో చెడో జగన్ అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ పోతున్నారు. సిద్ధం అని సభలనూ నిర్వహిస్తున్నారు. ఆయన అభ్యర్ధులు జనంలోకి పోతున్నారు.
రేపటి రోజున లెవెంత్ హవర్ లో టీడీపీ జనసేన అభ్యర్ధులు జనంలోకి వచ్చినా వారు ప్రచారంలో వెనకబడిపోతారని, క్యాడర్ నుంచి సహకారం అందుకోవడం అసంతృప్తులను చల్లార్చుకోవడం కష్టం అవుతుందని విశ్లేషణలు ఉన్నాయి.
చూస్తూంటే వైసీపీకి వ్యతిరేకత ఉందని చెబుతూ జగన్ కే రెండవసారి అధికారాన్ని బంగారు పళ్ళెంలో అప్పగించేలా విపక్ష కూటమి తీరు ఉందని అంటున్నారు. ఇప్పటికైనా అభ్యర్ధుల ప్రకటన పూర్తి చేసి జనంలోకి వెళ్తేనే మేలు అన్నది రెండు పార్టీలలో వినిపిస్తున్న మాట.