మేం చెడు చేశామ‌ని న‌మ్మిన‌ప్పుడు పొత్తులెందుకు? : జ‌గ‌న్ స్ట్ర‌యిట్ క్వ‌శ్చ‌న్‌

అసెంబ్లీ వేదిక‌గా ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు సీఎం జ‌గ‌న్ నేరుగా కీల‌క ప్ర‌శ్న సంధించారు. ''మేం త‌ప్పుచేశామ‌ని చెబుతున్నారు

Update: 2024-02-07 03:00 GMT

అసెంబ్లీ వేదిక‌గా ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు సీఎం జ‌గ‌న్ నేరుగా కీల‌క ప్ర‌శ్న సంధించారు. ''మేం త‌ప్పుచేశామ‌ని చెబుతున్నారు. మా వ‌ల్ల రాష్ట్రం ఏదో అయిపోయింద‌ని అంటున్నారు. మేం ప‌నికిరామ‌ని చెబుతున్నారు. అలాంట‌ప్పుడు.. పొత్తులు ఎందుకు? మేం త‌ప్పు చేశామ‌ని ప్ర‌జ‌లు భావిస్తే.. మేం గాలికి ఎగిరిపోతాం క‌దా. ఇంత మాత్రానికి ఎక్క‌డెక్క‌డి నుంచో నాయ‌కులు రావ‌డం ఎందుకు. పొత్తులు పెట్టుకోవ‌డం ఎందుకు..? పొత్తుల కోసం చంద్ర‌బాబు పాకులాడ‌డం ఎందుకు?'' అని సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌శ్నించారు.

బ‌డ్జెట్ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర అభివృద్దితోపాటు.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, ముఖ్యంగా టీడీపీపైనా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ''మా ప్ర‌భుత్వం ఈ ఐదేళ్లలో ప్ర‌జ‌ల‌కు మంచి కాదు, చెడు చేసిందని ప్రతిపక్షం ప్ర‌చారం చేస్తోంది. అలా చంద్ర‌బాబు నమ్మినప్పుడు ప్రతిపక్షాలన్నీ ఎందుకు ఏకం కావాలి? అలాంటి అవసరమేముంది? నేనే గాలికి ఎగిరిపోతాను కదా?'' అని సీఎం జ‌గ‌న్ అన్నారు. ఒక‌రితో ప్ర‌త్య‌క్షంగా, మరొక‌రితో ప‌రోక్షంగా చంద్ర‌బాబు పొత్తులు పెట్టుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. కుట్ర‌ల‌తో అధికారం ద‌క్కించుకోవాల్సిన ప‌రిస్ధితిలో ప్ర‌తిప‌క్షం ఉందని ఎద్దేవా చేశారు.

''ప్రతిపక్షం బ‌ల‌ప‌డ‌లేదు.. అభివృద్ది చేసిన అధికార పార్టీకి(వైసీపీ) తిరుగులేదు'' అని నిండు స‌భ‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. కేంద్రం నుంచి నిధులు స‌రిగా రావ‌డం లేద‌ని.. ఆర్థిక సంఘాలు సిఫార‌సు చేస్తున్న‌ది ఒక‌టైతే.. కేంద్రం ఇస్తున్న‌ది మ‌రొక‌ట‌ని దీంతో రాష్ట్రం ఇబ్బంది ప‌డుతోంద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని గ‌ణాంకాల‌ను వెల్ల‌డించారు. 14, 15 ఆర్థిక సంఘాల లెక్క‌లు కూడా వెల్ల‌డించారు. నిధులు రాక‌పోయినా, చాల‌క‌పోయినా.. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన అప్పులు క‌ట్టుకుంటూనే వ‌స్తున్నామన్నారు.

అదేస‌మ‌యంలో నిధులు లేవ‌ని, అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌ని వెనుకంజ వేసి.. ఎన్న‌డూ సంక్షేమ ప‌థ‌కాలు ఎగ్గొట్ట‌లేదని సీఎం జ‌గ‌న్ చెప్పారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో 99శాతం అమ‌లు చేశామని స‌భ‌లో సీఎం జ‌గ‌న్ తెలిపారు. ''ఇంటింటి ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌ను మార్చేశాం. పేద‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌గ‌లిగాం. పేద‌ల త‌ల‌రాత‌, భ‌విష్య‌త్తును మార్చేలా ప్ర‌తి రూపాయి బాధ్యత‌తో వారికి ఇస్తూ హ్యూమ‌న్ క్యాపిట‌ల్‌పై పెట్టుబ‌డి పెట్టాం. ఇది త‌ప్ప‌ని చంద్ర‌బాబు చెప్ప‌గ‌ల‌రా'' అని సీఎం జ‌గ‌న్ అన్నారు.

Tags:    

Similar News