వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల @ ఏపీ...!

ఆయన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పాలించిన ముఖ్యమంత్రులలో అత్యధిక ప్రజాదరణ కలిగిన వారిలో ఒకరిగా ఉన్నారు.

Update: 2024-01-05 09:24 GMT

వైఎస్సార్ అంటే ఈ రోజుకీ ప్రాణం పెట్టే జనాలు ఉమ్మడి ఏపీ నిండా ఉన్నారు. పాలన చేసింది అయిదుంపావు సంవత్సరాలు అయినా శాశ్వత కీర్తిని వైఎస్సార్ గడించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పాలించిన ముఖ్యమంత్రులలో అత్యధిక ప్రజాదరణ కలిగిన వారిలో ఒకరిగా ఉన్నారు. వైఎస్సార్ ఒక బ్రాండ్ ఇమేజ్. ఆయన ఒక పొలిటికల్ ఇన్స్పిరేషన్. ఆయనే ఒక పొలిటికల్ యూనివర్సిటీ. ఇలా ఎన్ని అయినా వైఎస్సార్ గురించి చెప్పుకోవచ్చు.

జాతీయ స్థాయిలో ఇందిరమ్మకు వచ్చిన పాపులారిటీ. బడుగు బలహీన వర్గాలలో దక్కిన అవ్యాజమైన ప్రేమ ఆదరణ ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ కి కూడా దక్కడం విశేషంగా చెప్పుకోవాలి. అంతటి ప్రజాదరణ పొందిన నాయకుడికి వారసులు ఉంటారు. వారు కుటుంబ సభ్యులే కాదు బయట వారు కూడా. అయితే ఆ మహా నేత వారసుడిగా అతి తక్కువ సమయంలోనే కుమారుడు వైఎస్ జగన్ జనం మెప్పు పొంది బలంగా నిలిచారు.

వైఎస్సార్ మరణానంతరం జగన్ పేరు ఒక గర్జనలా వినిపించింది. జగన్ అన్న మూడు అక్షరాలతో నాడు ఉమ్మడి ఏపీని అనంతరం విభజన ఏపీని జగన్ రీ సౌండ్ పెట్టించారు. జగన్ మొత్తం రాజకీయం చూస్తే పదిహేనేళ్ళుగా ఉంటుంది. అందులో మొదటి అయిదేళ్ళు ఏంపీగా ఉంటే తరువాత అయిదేళ్ళూ ఏపీకి తొలి విపక్ష నేత, ఆ తరువాత అయిదేళ్ళూ ఏపీకి రెండవ సీఎం గా జగన్ కనిపిస్తారు.

ఇందులో ప్రతీ అయిదేళ్ళూ జగన్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఆయన అంటే ఏంటో చూపించాయి. కాంగ్రెస్ ని కాదనుకుని బయటకు వచ్చి పార్టీ పెట్టి పోరాటం చేసిన యోధుడిగా జగన్ తొలి అయిదేళ్ళలో కనిపించారు. జైలుకు సైతం ఆయన వెళ్ళి తనలోని పోరాట పటిమ తగ్గలేదు అనిపించుకున్నారు. ఆ తరువాత అయిదేళ్ళూ విపక్ష నేతగా సీనియర్ నాయకుడు చంద్రబాబుని ఎదుర్కొని ఏపీ రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పారు. పాదయాత్ర సుదీర్ఘంగా చేసి తాను అనుకున్న అధికారాన్ని అందలాన్ని 151 సీట్ల భారీ మెజారిటీతో అందుకున్నారు.

ఇక ముఖ్యమంత్రిగా జగన్ అయిదేళ్ల పాలనలో సంక్షేమ రాజ్యాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన తీరు కనిపిస్తుంది. పధకాలు పంపిణీలో కొత్త ఒరవడిగా నేరుగా నగదును లబ్దిదారుల ఖాతాలో జమ చేయడం వంటివి జగన్ పాలనలో వినూత్న పోకడలకు దర్పణం పడతాయి. వైఎస్సార్ కి ఆయన ఆశయాలను తానే వారసుడిని అని జగన్ ఈ విధంగా ప్రతీ మలుపులోనూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. జనాల మెప్పు మొగ్గు ఆయనకు ఉండబట్టే సీఎం గా అయిదేళ్ళు సాఫీగా పూర్తి చేసుకోగలుగుతున్నారు.

ఇక వైఎస్ షర్మిల గురించి చెప్పుకోవాలంటే అన్నకు తగిన చెల్లెలు. తండ్రికి తగిన కూతురు అని చెప్పాలి. ఆమె రాజకీయం అంతా అన్న చాటుగానే మొదలైనా తరువాత తనదైన శైలిని అలవరచుకున్నారు. జగన్ జైలు జీవితం అనుభవిస్తున్న వేళ పార్టీకి అండగా దండగా ఉంటూ ఆనాడు ఏకంగా రెండు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి సంచలనం రేపారు. వైసీపీ సభలలో ఆమె చేసిన ప్రసంగాలు కూడా మెచ్యూరిటీతో సాగినవి అని చెప్పక తప్పదు.

2019 ఎన్నికల వేళ వైసీపీకి ఆమె విశేషంగా ప్రచారం చేశారు. ఇలా వైఎస్సార్ బిడ్డలు ఇద్దరూ జనంలోనే ఉన్నారు. ఇక వైఎస్ జగన్ సీఎం అయ్యారు. వైఎస్ షర్మిలలోనూ రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని ఆమె పార్టీ తెలంగాణాలో పెట్టాక తెలిసింది. ఆమె పార్టీని అక్కడ మూడేళ్ల పాటు అతి కష్టం మీద నడిపారు. ఎన్నో ఉద్యమాలు చేశారు. మూడువేల ఎనిమిది వందల కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేశారు.

ఇవన్నీ ఆమెలోని పోరాట పటిమని చాటిచెప్పాయనే భావించాలి. అయితే రాజకీయాల్లో పోరాటంతో పాటు వ్యూహాలు కూడా ఉండాలి. మరి ఆమె కరెక్ట్ వ్యూహం అనుకుని కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఆమెకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చు అని వార్తలు వస్తున్న నేపధ్యం ఉంది. నా తండ్రి వైఎస్సార్ రుణం తీర్చుకుంటాను అని ఆమె కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసిన వేళ అన్న మాటలు. అంటే ఆమె వైఎస్సార్ వారసత్వాన్ని కొనసాగించి తీరుతారు అని అంటున్నారు.

వర్తమానంలో చూస్తే ఆడ మగ అన్న తేడా అయితే లేదు. రాజకీయ వారసత్వం సమర్ధతను బట్టి దక్కుతుంది. అందులో అనుమానం లేదు. ఇక షర్మిల లో పోరాట పటిమ పట్టుదల అటు తండ్రి ఇటు అన్నకు సరిసమాంగా ఉన్నాయని ఆమె తెలంగాణా రాజకీయం నిరూపించింది.

ఇపుడు ఆ పోరాటాన్ని సరైన వ్యూహంతో ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆమె అనుకున్న వైఎస్సార్ వారసత్వం విషయంలో సక్సెస్ అవుతుంది. ఆమె వెనక గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి వ్యూహాలకు కొదవ లేదు. దాంతో షర్మిల పొలిటికల్ గ్లామర్ కి కాంగ్రెస్ గ్రామర్ కలిస్తే ఏమైనా జరగవచ్చా అన్నది ఒక చర్చ.

ఇక ఇప్పటికే వైఎస్సార్ వారసుడిగా జగన్ ఎస్టాబ్లిష్ అయ్యారు కదా కుమార్తెకు ఏ మాత్రం అవకాశం ఉంటుంది అంటే కాలమే చెప్పాలి. ఇక్కడ చూస్తే ఎన్టీయార్ వారసుడిగా చంద్రబాబు కనిపిస్తారు. దాని కోసం ఎందరు పోటీ పడినా బ్లడ్ రిలేషన్ అని ముందుకు వచ్చినా జనాల ఓటు బాబుకే పడింది. అలా వైఎస్సార్ వారసత్వం పోరులో ఇపుడు అన్న చెల్లెలు ముందుకు వచ్చారు. జనాల ఓటు ఎవరికి అన్నది కాలమే తేల్చనుంది.

Tags:    

Similar News