ఉత్తరాంధ్రాలో వైసీపీకి నాయక్ ఎవరు ?

వైసీపీకి ఉత్తరాంధ్ర కీలకంగా మారుతోంది. ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో రెండంటే రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి.

Update: 2025-02-08 04:05 GMT

వైసీపీకి ఉత్తరాంధ్ర కీలకంగా మారుతోంది. ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో రెండంటే రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. అది కూడా విశాఖ ఏజెన్సీలో. దాంతో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్న చోట పార్టీ ఎందుకు ఇంతలా డీలా పడిపోయింది అన్నది వైసీపీలో అంతర్మధనం గా ఉంది.

అయితే వైసీపీని బలోపేతం చేయడం ద్వారా పూర్వ వైభవం సాధించాలని చూస్తున్నారు. అందుకోసం విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించకుండానే ఏకంగా పార్టీకి రాజకీయాలకూ దూరం అయిపోయారు.

దాంతో ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ పదవి కోసం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తిని చూపుతున్నారని టాక్ నడుస్తోంది. ఆయన ఇప్పటికే శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయనకు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా పార్టీ బాధ్యతలు అప్పగించింది.

అయితే ఉత్తరాంధ్రాలో మంచి పట్టు పలుకుబడి ఉన్న బొత్సకి కనుక ఈ బాధ్యతలు ఇస్తే ఆయన పార్టీని బలోపేతం చేయగలరని ఆయన వర్గీయులు అంటున్నారు. కానీ అధినాయకత్వం అనేక మంది పేర్లను పరిశీలిస్తోంది అని అంటున్నారు.

అదే ఉత్తరాంధ్ర కు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఈ కీలక బాధ్యతలు అప్పగించాలని కూడా పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అన్న టాక్ నడుస్తోంది. ఆయన కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. వ్యూహ రచన చేయడంలో నిష్ణాతులు. అందరినీ కలుపుకుని పోయే తత్వం ఉన్న వారు.

పైగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. అక్కడ టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అంటున్నారు. దాంతో ధర్మానకు ఈ పదవి ఇస్తే పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని ఆయన కూడా యాక్టివ్ అవుతారని ఆలోచిస్తున్నారుట. కానీ ధర్మాన ఈ పదవిని తీసుకుంటారా అన్నదే చర్చగా ఉంది. ఆయన చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. దాంతో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించలేకపోవచ్చు అని అంటున్నారు.

యువతకు పట్టం కడతామనుకుంటే విశాఖ జిల్లాకు చెందిన నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఉన్నారు. అయితే ఆయన పార్టీ నాయకులను కలుపుకుని పోవడంలో పెద్దగా చొరవ చూపించరు అన్న కామెంట్స్ ఉన్నాయట. టీడీపీ మీద విమర్శలు చేయడంలో ఆయన ముందుంటారని కానీ ఈ పదవిని మూడు జిల్లాలతో కో ఆర్డినేట్ చేసుకుని చేపట్టాల్స్ ఉంటుందని అంటున్నారు.

చిత్రంగా కడప జిల్లాకు చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోందిట. ఆయనను తెచ్చి ఉత్తరాంధ్ర జిల్లాల కీలక బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు అయితే అలా చేయడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని అంటున్నారు. బీసీలు ఎక్కువ మంది ఉన్న ఉత్తరాంధ్రాలో స్థానికులకు ఈ పదవిని ఇస్తేనే పార్టీ ఎత్తిగిల్లుతుందని అంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News