జనసేనపైన కావాలనే ఫోకస్ పెంచిందా ?
తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. రాబోయే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కాదని జనసేన మాత్రమే అని జనాలకు వైసీపీ చెప్పదలచుకున్నదా ? అంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడచిన 20 రోజులుగా మీడియా అటెన్షన్ ఎక్కువగా జనసేన మీద ఉండటమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి. మామూలుగా అయితే వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీ మాత్రమే. జనసేన అయినా మిగిలిన పార్టీలైనా టీడీపీ తర్వాత మాత్రమే.
కానీ గడచిన 20 రోజులుగా అంటే పవన్ వారాహి యాత్ర మొదలు కాకముందు నుండి మీడియా దృష్టి మొత్తం జనసేన చుట్టూనే తిరుగుతోంది. మీడియా వార్తలు, కథనాల్లో ఎక్కువగా పవన్ మాత్రమే ఫోకస్ అవుతున్నారు. మీడియాలో వార్ అంతా మంత్రులు-పవన్ మధ్యే అన్నట్లుగా సాగుతోంది. వారాహియాత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా జగన్మోహన్ రెడ్డిపైన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దాంతో మంత్రులు అంతేస్ధాయిలో రెచ్చిపోయి కంటర్లు ఇస్తున్నారు. దాంతో మీడియా మొత్తం ప్రభుత్వం-పవన్ చుట్టే తిరుగుతోంది.
ఇక రెండో విడత వారాహి యాత్ర మొదలవ్వటమే పవన్ ఏలూరు సభలో వాలంటీర్ల వ్యవస్ధపైన ఆరోపణలు చేశారు. వాలంటీర్లే హ్యూమన్ ట్రాఫికింగుకు కారణమని ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేయటంతో గోల మొదలైంది. ఈ గోల ఇలాగుండగానే సచివాలయ వ్యవస్ధ ఎందుకు దండగన్నారు. తాను అధికారంలోకి రాగానే వాలంటర్ల వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్ధను రద్దు చేస్తామని, నడుం విరగొడతానంటు నోటికొచ్చింది మాట్లాడేశారు. దాంతో నాలుగు రోజులుగా లెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునేంతవరకు అటు పవన్ ఆరోపణలు, ఇటు మంత్రులు ఎదురుదాడులే కనబడతున్నాయి.
ఇదంత చూస్తుంటే మంత్రులు కావాలనే జనసేనపైన ఫోకస్ పెట్టినట్లుగా అనుమానంగా ఉంది. టీడీపీని సైడ్ చేసే ఉద్దేశ్యంతోనే కావాలని పదేపదే పవన్ను టార్గెట్ చేస్తున్నట్లుంది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధలపై పవన్ చేసిన ఆరోపణలను మంత్రులు బాగా అడ్వాంటేజ్ తీసుకున్నట్లే ఉంది చూస్తుంటే. అందుకనే లోకేష్ పాదయాత్రకు కానీ చంద్రబాబునాయుడు కార్యక్రమాలకు కానీ తగినంత స్పేస్ మీడియాలో కనబడటం లేదు.