మూడేళ్ళలో జగన్ కి రాజయోగం...ఈ జోస్యం ఎవరిది ?
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన పార్టీ స్తబ్దుగా ఉంది. ఆయన పార్టీ ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని మూటకట్టుకుంది. దాంతో పాటుగా 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ కి మరో నాలుగున్నరేళ్ల పాటు ఇలాంటి ఇబ్బందులే ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఆయన భారంగా నెట్టుకుని రావాల్సి ఉంటుంది. అయితే వైఎస్ జగన్ రాజకీయ జాతకం మారుతుందని వైసీపీ కీలక నేతలు గాఢంగా నమ్ముతున్నారు.
ఆయన తిరిగి ఏపీకి సీఎం అవుతారు అని అంటున్నారు. ఆ మంచి రోజు దగ్గర కాలంలోనే ఉంది అని అంటున్నారు. మరో మూడేళ్లలో అంటే 2027 చివరలో దేశమంతా జమిలి ఎన్నికలు జరుగాయని అపుడు ఏపీలో వైసీపీ బ్రహ్మాండమైన ఆధిక్యతతో అధికారాన్ని సొంతం చేసుకుంటుంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే జగన్ కి రాజయోగం ఉందని వైసీపీ నేతలు అంతా కలసి జోస్యం చెబుతున్నారు అన్న మాట.
చిత్తూరు తిరుపతి జిల్లాల వైసీపీ ఇంచార్జిగా భూమన కరుణాకరరెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా వైసీపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని ధీమాగా చెప్పుకొచ్చారు. గట్టిగా మూడేళ్ళు కూడా లేదు. మళ్లీ మనమే రాబోతున్నామని వారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
విజయసాయిరెడ్డి అయితే ఈసారి అద్భుతమైన విజయం వైసీపీ సొంతం చేసుకోబోతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే కూటమి నేతలు వైసీపీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అయితే జగన్ ప్రజలకు ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలు చేశారు అని గుర్తు చేశారు. ఇపుడు ఏపీలో సంక్షేమం లేదు ఏదీ లేదని కూటమి సర్కార్ ని నిందించారు. విశాఖలోని రుషికొండ నిర్మాణాలను చంద్రబాబు స్వయంగా వెళ్ళి చూసి వచ్చారని అన్నారు.
అదే విధంగా వైసీపీ హయాంలో ఏపీలో నాలుగు పోర్టులను తమ ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. వాటిని ఇపుడు టీడీపీ కూటమి ప్రైవేట్ పరం చేస్తోందని అన్నారు. ఏపీలో అభివృద్ధి లేకపోగా డైవర్షన్ పాలిటిక్స్ కి తెర తీస్తున్నారు అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీనే కోరుకుంటారని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 సీట్లకు 14 వైసీపీ ఈసారి గెలుచుకోవడం ఖాయమని అన్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ నేతలు కొన్ని విషయాలను అంగీకరించడం విశేషం. తమ ప్రభుత్వ హయాంలో కొన్ని వర్గాలు దూరం అయ్యాయని ఇపుడు అందరికీ కలుపుకుని పోయే ప్రయత్నం జరుగుతోందని వారు చెబుతున్నారు. మొత్తానికి అయిదేళ్ళు అంటే భారంగా అనిపించిన వైసీపీ నేతలకు ఇపుడు మూడేళ్ళు ఆగండి అని ఆ పార్టీ పెద్ద నాయకులు చెబుతున్నారు. ఉందిలే మంచి కాలం అంటున్నారు. జగన్ సీఎం అవుతారని కూడా భరోసా ఇస్తున్నారు. జమిలి వచ్చేది జగన్ కోసమేనా. ఏమో చూడాల్సి ఉంది.