ఇది గమనించారా...జగన్ వర్సెస్ పవన్...ఎందుకలా ?

ఏపీలో ఎన్నికల ముందు వరకూ వైసీపీ టీడీపీతో పాటుగా జనసేనను కూడా గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చింది.

Update: 2024-09-12 04:00 GMT

ఏపీలో ఎన్నికల ముందు వరకూ వైసీపీ టీడీపీతో పాటుగా జనసేనను కూడా గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే పవన్ నే జగన్ నుంచి అంతా విపరీతంగా విమర్శిస్తూ వచ్చారు. జగన్ అయితే పవన్ వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఘాటైన కామెంట్స్ చేసేవారు.

దానికి తోడు అన్నట్లుగా వైసీపీ ఫైర్ బ్రాండ్లు కూడా పవన్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసేవారు. అలా పవన్ తో పాటు ఆయన వెనక ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ గిట్టనిది అయిపోయింది. సాధారణంగా చూస్తే పవన్ ఫక్తు పొలిటీషియన్ కాదు, ఆయనకు రాజకీయ వైరాలు ఎవరితోనూ లేవు. అలాంటి పవన్ కి కోరి కెలికి ఆగర్భ శత్రువుగా వైసీపీ మార్చుకుంది. పవన్ లో ఎంతలా పట్టుదల పెంచింది అంటే ఎంత తక్కువ సీట్లు అయినా తీసుకుని పొత్తుకు సిద్ధపడేటట్లుగా.

మొత్తానికి వైసీపీని ఓడించాలి అన్న ఏకైక అజెండాతోనే 2024 ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగారు. అలా తాను అనుకున్న లక్ష్యాన్ని ఆయన నెరవేర్చుకుని పొలిటికల్ హీరోగా నిలిచారు. పవన్ రెండు సీట్లలో ఓటమి పాలు అయ్యారు. ఆయన ఏమి చేయగలరు అని వెటకారమాడిన వైసీపీ గొంతుకలు అన్నీ మూగబోయేలా పవన్ కూటమి కట్టించి మరీ ఫ్యాన్ పార్టీ ఆట కట్టించారు.

ఇక ఎన్నికలు ముగిసాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ అంతా అనుకున్నట్లుగా జనసేన అయితే జగన్ మీద విరుచుకుని పడటం లేదు. ఆయన తనకు ఉన్న అపరిమితమైన అధికార బలం చూసుకుని వైసీపీని టాప్ టూ బాటమ్ నేతలను తూలనాడడం లేదు. ఒక విధంగా చెప్పాలీ అంటే పవన్ ఎంతో హుందాగా సంయమనం పాటిస్తూ వస్తున్నారు.

ఆయనకు ఈ రాజకీయ కక్షలు ప్రతీకార రాజకీయాలు అన్నవి గిట్టవు అన్న మాటలనే నిజం చేస్తూ ఒక స్పూర్తిగా ఉంటున్నారు. అదే సమయంలో పవన్ ఏమిటో ఆయన రాజకీయం ఏమిటో తెలిసి వచ్చిన వైసీపీ కూడా గత మూడు నెలలుగా ఆయనను ఒక్క మాట అంటే ఒట్టు. పవన్ ఊసు ఎత్తడం లేదు. ఆయన మీద చిన్నపాటి విమర్శ కూడా చేయడంలేదు.

పవన్ ని ఒక్క మాట అన్నా ఆయన వెనక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా దెబ్బేస్తుందో వైసీపీకి ఎరుక అయింది అని అంటున్నారు. దాంతో పాటుగా పవన్ వైపు నుంచి కూడా ఏ విధంగానూ ప్రతీకార రాజకీయాలు లేవు. దాంతో జనసేనను పక్కన పెట్టి వైసీపీ తన రాజకీయాన్ని తన యుద్ధాన్ని టీడీపీ మీదనే కొనసాగిస్తోంది.

టీడీపీ కూటమిలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నా జనసేన బీజేపీలను సైడ్ చేసి టీడీపీని చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తోంది. మరి దీని వెనక ఏమి అర్థాలు ఉన్నాయో తెలియదు కానీ చంద్రబాబునే వైసీపీ చూస్తోంది. ఆయన మీదనే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది.

పవన్ మైనస్ బాబుని ఢీ కొట్టడం వెరీ ఈజీ అనుకుంటోందా లేక ఏ రోజుకు అయినా బాబు నుంచి పవన్ వేరు పడతారు అని భావిస్తోందా లేక బాబుని కార్నర్ చేయడం ద్వారా జనసేన మీద సాఫ్ట్ కార్నర్ ని ప్రదర్శిస్తోందా అన్నది ఈ రోజుకు అయితే తెలియదు. ఏపీలో మాత్రం జనసేన వర్సెస్ వైసీపీ అన్నదే లేకుండా పోయింది. ఇది కేవలం మూడు నెలల్లో వచ్చిన భారీ రాజకీయ మార్పు.జనాలు దీనిని గమనిస్తున్నారో లేదో తెలియదు మరి.

Tags:    

Similar News