ఇంటర్ కూడా హైస్కూల్ లోనే... జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!

ఏపీలో విద్యారంగంలో జగన్ సర్కార్ గడిచిన నాలుగేళ్లలో ఎన్నో సంస్కరణలు అమలు చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-09-26 10:35 GMT

ఏపీలో విద్యారంగంలో జగన్ సర్కార్ గడిచిన నాలుగేళ్లలో ఎన్నో సంస్కరణలు అమలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విషయంలో జగన్ సర్కార్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోందని తెలుస్తుంది.

అవును... విద్యారంగంలో జగన్ సర్కార్ అత్యంత కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్య ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులో ఉంది. అయితే... దీన్ని మరింతగా విస్తరించి ఉన్నత పాఠశాలల్లోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తుంది.

అదే జరిగితే రాష్ట్రంలోని ఎంపిక చేసిన హైస్కూళ్లలో పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ విద్య కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో... రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఎంపిక చేసిన హైస్కూళ్లలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు.. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విస్తరించాలని చూస్తున్నట్లు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారు.

ఇంటర్‌ విద్యార్థులకూ గోరుముద్ద:

ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అమలు చేస్తోన్న "జగనన్న గోరుముద్ద" పథకాన్ని త్వరలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకూ వర్తింప చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స ఈ మేరకు బదులిచ్చారు.

ఇదే సమయంలో "అమ్మ ఒడి" పథకంతో స్కూల్ డ్రాప్‌ అవుట్స్‌ చాలామేరకు తగ్గాయని వెల్లడించిన బొత్స సత్యనారాయణ... "గోరుముద్ద"తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా బడిబాటపట్టారని అన్నారు. ఇక "నాడు–నేడు"తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారాయని తెలిపారు.

త్వరలో డీఎస్సీపై నిర్ణయం:

మండలానికి కనీసం రెండు ఉన్నత పాఠశాలలను ఇంటర్‌ వరకు అప్‌ గ్రేడ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపిన మంత్రి బొత్సా సత్యనారాయణ... రాష్ట్రవ్యాప్తంగా 1,960 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వాటిలో 505 మంది సమగ్ర శిక్ష ద్వారా పార్ట్‌ టైమ్‌ విధానంలో పనిచేస్తున్నారని.. మిగిలిన పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు.

ఇదే క్రమంలో త్వరలో డీఎస్సీ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇదే సమయంలో ఆట స్థలాలు లేని కార్పొరేట్‌ పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News