వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ ఇలాగయితే గట్టెక్కెదెలా?

ఆర్కే రోజా.. వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌. ఎవరినైనా, ఏ స్థాయి నేతనైనా ఎంత మాటయినా అనేయగలరని పేరు తెచ్చుకున్నారు.

Update: 2024-05-04 09:49 GMT

ఆర్కే రోజా.. వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌. ఎవరినైనా, ఏ స్థాయి నేతనైనా ఎంత మాటయినా అనేయగలరని పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రోజాకు ఈసారి కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయని టాక్‌ నడుస్తోంది.

రోజా టీడీపీ తరఫున రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004లో నగరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి చిత్తయ్యారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రోజా 2014లో నగరి నుంచి పోటీ చేసి కేవలం 858 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2019లో మరోసారి వైసీపీ తరఫున బరిలో నిలిచి గెలుపొందారు. అయితే వైసీపీ గాలి ప్రభంజనంలా వీచిన ఈ ఎన్నికల్లోనూ రోజా కేవలం 2 వేలకు పైగా ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు. వైఎస్‌ జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగానూ రోజా అవకాశం దక్కించుకున్నారు.

ఇప్పటివరకు నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయి రెండుసార్లు గెలిచిన రోజా ఐదోసారి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆమె హ్యాట్రిక్‌ సృష్టించినట్టు అవుతుంది. అయితే పరిస్థితులు మాత్రం ఆమెకు అనుకూలంగా లేవని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు.

ముఖ్యంగా నగరి నియోజకవర్గ ౖవైసీపీలో కీలకంగా ఉన్న రెడ్డివారి చక్రపాణిరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కేజే కుమార్, ఆయన భార్య కేజే శాంతి, అమ్ములు, వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్‌ రెడ్డి తదితరులతో రోజాకు తీవ్ర విభేదాలు ఉన్నాయి.

రోజా మద్దతు లేకపోయినా మరో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుతో రెడ్డివారి చక్రపాణిరెడ్డి శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌ గా, కేజే శాంతి ఈడిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ గా, అమ్ములు పుత్తూరు వైసీపీ ఇంచార్జిగా పదవులు దక్కించుకున్నారు.

కాగా ప్రతిపక్ష నేతలపైనే కాకుండా తన నోటి దురుసును నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలపైనా రోజా చూపుతున్నారని అంటున్నారు. ఈ నోటి దురుసే ఆమెకు మంత్రి పదవి రూపంలో మేలు చేస్తే.. సొంత పార్టీ నేతల్లో కీడు చేస్తోందని చెబుతున్నారు. నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలను ఎంత మాట పడితే అంతమాట అంటున్నారని.. దీంతో ఆమెపై అసమ్మతి పెరుగుతోందని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలంతా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి రోజాకు ఈసారి టికెట్‌ ఇవ్వవద్దని వీరంతా గట్టిగా డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అయితే రోజాకే జగన్‌ టికెట్‌ ఇచ్చారు. దీంతో అసమ్మతి నేతలంతా టీడీపీలో చేరారు. రోజాను చిత్తుగా ఓడిస్తామని ప్రతినబూనారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభంజనంలోనే బొటాబొటీ మెజారిటీతో గెలుపొందిన రోజా ఈసారి గెలుపొందడం అంత ఈజీ కాదని అంటున్నారు.

Tags:    

Similar News