జనసేనలోకి వైసీపీ బ్యాచ్ ఎంట్రీకి నాగబాబు గ్రీన్ సిగ్నల్.. షరతులు వర్తిస్తాయట
దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ తాను పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించటం.. వంద శాతం స్ట్రైకింగ్ రేటును సొంతం చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.
అధికారం చేతిలో లేనప్పుడు ఉండే పరిస్థితులకు.. పవర్ చేతికి చిక్కిన తర్వాత చోటు చేసుకునే మార్పులకు ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. జనసేనకు వైసీపీకి మధ్య శత్రుత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మాటకు వస్తే.. జనసేనను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు సైతం వైసీపీ నేతలు కొందరు ససేమిరా అనేవారు. పవన్ కల్యాణ్ ను రాజకీయ నాయకుడని ఎవరన్నారు? అదో పార్టీ.. ఆయనో అధినేత.. ఆ పార్టీకి నాయకులు కూడానా.. అంటూ చులకన చేస్తూ మాట్లాడిన వారికి కొదవ లేదు.
టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఎవరినైతే చులకన చేస్తామో.. ఎవరినైతే మాటలతో అవమానాలకు గురి చేస్తామో.. వారికి సైతం మంచిరోజులు ఉంటాయి కదా? ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ఓటర్లు అదే విషయాన్ని తెలియజేశారు. కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం.. జనసేన.. బీజేపీలకు తిరుగులేని అధిక్యతను కట్టబెట్టటమే కాదు.. ఏకంగా 164 సీట్ల మెజార్టీని అందించారు. దీంతో.. సీన్ మొత్తం మారిపోయింది. అప్పటివరకు జనసేనను రాజకీయ పార్టీగా చూసేందుకు సైతం ఇష్టపడని వైసీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయింది.
దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ తాను పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించటం.. వంద శాతం స్ట్రైకింగ్ రేటును సొంతం చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. అపూర్వ విజయం సాధించిన తర్వాత కూడా అహంకారానికి పోకుండా.. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకుంటూ వేస్తున్న అడుగులు పలువురిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. జనసేన విజయం సాధించిన నియోజకవర్గాల్లోని పరిస్థితుల్లో వచ్చిన మార్పులు.. కొత్త సమీకరణాలకు తెర తీసేలా మారాయి. పెద్ద ఎత్తున వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలు జనసేనలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు తగ్గట్లు తమ రాకకు ఓకే చెప్పాలంటూ రిక్వెస్టులు పంపుతున్న పరిస్థితి.
అయితే.. ఈ విషయంలో తొందరపడకూడదని భావించిన పవన్ కల్యాణ్.. పార్టీ అధికారంలోకి వచ్చిన నెలన్నరరోజుల్లో ఎలాంటి నిర్ణయాన్ని తీసుుకోలేదు. అయితే.. వైసీపీ నేతలు.. కార్యకర్తల నుంచి వస్తున్న విన్నపాలకు తాజాగా ఓకే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసుకోవటంతో పాటు.. తిరుగులేని అధిక్యతను సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో తమకు ట్రేడ్ మార్కుగా ఉన్న సిద్ధాంత బలం నుంచి తప్పుకోకుండానే చేరికలు ఉండాలన్న విషయాన్ని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.
జనసేనలో చేరాలనుకునే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు.. కార్యకర్తల వివరాల్ని ముందుగా సేకరించటం.. వీరి బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేయటంతో పాటు.. వారి పూర్వరంగంలో జనసేన కార్యకర్తల్ని వేధింపులకు గురి చేయని క్లీన్ హిస్టరీ ఉన్న వారిని మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. జనసేన పరివారాన్ని ఇబ్బందులకు గురి చేయని.. కేసులు పెట్టని వారికి మాత్రమే ‘టీ గ్లాసు’ కండువాను కప్పుకోవటానికి.. దాన్ని పట్టుకోవటానికి కానీ అర్హత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు. ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది.