ప‌ద‌వి పోయినా ప‌వ‌ర్ త‌గ్గ‌లేదే.. వెల్లంప‌ల్లిపై టీడీపీ ఫైర్‌!

చింత‌చ‌చ్చినా పులుపు చావలేదన్న సామెత‌కు ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు స‌రిగ్గా స‌రిపోతాడ‌ని అంటున్నారు.

Update: 2023-08-06 12:30 GMT

చింత‌చ‌చ్చినా పులుపు చావలేదన్న సామెత‌కు వైసీపీ నాయ‌కుడు, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు స‌రిగ్గా స‌రిపోతాడ‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం వెల్లంప‌ల్లి మంత్రి కాదు. గ‌తంలో ఆయ‌న మంత్రిగా ప‌నిచేశారు. అయితే.. రెండో ద‌శ మంత్రివ‌ర్గంలో ఆయ‌న‌ను తొల‌గించారు. కానీ, వెల్లంప‌ల్లి మాత్రం మంత్రిక‌న్నా ఎక్కువగా రెచ్చిపోతున్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా ఏం జ‌రిగిందంటే.

టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టి బొమ్మను వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు ద‌గ్గ‌రుండి దహ‌నం చేయించారు. అంతేకాదు.. పార్టీ నాయకులూ కార్యకర్తలతో కలసి చంద్రబాబు శవయాత్ర చేసి దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని అన్నారు. పోలీసులపై దాడి కేసులో ఏ1 చంద్రబాబుని అరెస్ట్ చెయ్యాలని వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ కోసమే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారన్న ఆయ‌న ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌పైనా విరుచుకుప‌డ్డారు.

సీఐ అంజూ యాదవ్ ఒక కార్యకర్తను కొడితే పవన్ కళ్యాణ్ హుటాహుటిన బయల్దేరాడని, మ‌రి ఇప్పుడు పోలీసులు గాయ‌ప‌డితే.. ప‌వ‌న్‌కు క‌నిపించ‌లేదా? అని వెల్లంప‌ల్లి ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు రౌడీ స్టార్ , పవన్ ఫ్యాకేజి స్టార్, లోకేష్ పనికిరాని స్టార్ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ``పోలీసులపై జరిగిన దాడి పవన్ కి కనిపించట్లేదా? వైసీపీ కార్యకర్తలు తిరగపడితే జనసేన ,టీడీపీ తట్టుకోలేదు. మమల్ని రెచ్చగొడితే బడిత పూజ తప్పదు. దమ్ముంటే పెద్దిరెడ్డి మీద పోటీ చేసి గెలవండి`` అని వెల్లంప‌ల్లి వ్యాఖ్యానించారు.

అయితే.. వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌ల‌ను టీడీపీ నాయ‌కులు తిప్పికొట్టారు. ప‌వ‌ర్ పోయినా.. పొగ‌రు త‌గ్గ‌లేద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నీకు టికెట్ కూడా క‌ష్ట‌మేన‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News