డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి... ఇడుపులపాయలో ఘనంగా నివాళులు!
వైఎస్సార్... ఆ పేరు ఓ ప్రభంజనం. ఆ పేరు వినపడగానే తెలుగునేల మీద ప్రతి గుండె స్పందిస్తుంది.
వైఎస్సార్... ఆ పేరు ఓ ప్రభంజనం. ఆ పేరు వినపడగానే తెలుగునేల మీద ప్రతి గుండె స్పందిస్తుంది. ఆ నవ్వులో స్వచ్ఛత.. ఆ పిలుపులో ఆత్మీయత.. మాట తప్పని, మడమ తిప్పని నైజం ఆయన సొంతం. ఆయన వేసే ప్రతీ అడుగూ సామాన్యుడి క్షేమం గురించే.. ఆయన తీసుకున్న ప్రతీ నిర్ణయం రైతు సంక్షేమం గురించే! అలాంటి వైఎస్సార్ మరణించి నేటికి 14ఏళ్లు!
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం సెప్టెంబర్ 2న ఆకాశంలో మేఘాలు పట్టాయి.. వాటిని లెక్క చేయని రాజన్న ప్రజాబాట పట్టారు. రచ్చబండలో ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకోనేందుకు బయలుదేరారు. వైఎస్సార్ పయనిస్తున్న హెలికాప్టర్ పావురాలగుట్టలో కుప్పకూలింది.
అనంతరం... ఆ ప్రమాధంతో రాజన్న తిరిగిరాని లోకాలకు మరలిపోయారన్న చేదునిజం భరించడం వేలాది గుండెలకు సాధ్యం కాలేదు. ఆ దుఃఖ సాగరంలో మునిగిన జీవితాలు, రోడ్డున పడ్డ బ్రతుకులు ఎన్నో ఎన్నెన్నో! కారణం... వైఎస్సార్ ఒక రాజకీయ నాయకుడే కాదు.. రాజనీతిజ్ఞుడు!
తాను తమ్మిన, తనను నమ్మిన వారికొసం ఎంతదూరమైనా వెళ్లగలిగే వ్యక్తి వైఎస్సార్. అటు విద్యారంగంలోనూ, ఇటు వైద్యరంగంలోనూ, వ్యవసాయరంగం లోనూ వైఎస్సార్ ప్రజలకు చేసిన మేలెంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ గుండెను అడిగినా గొంతెత్తి చెబుతుంది! ఫలితంగా... ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం అన్నది.. వైఎస్సార్ జీవన సిద్దాంతం అయిపోయింది!
ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా... రాష్ట్రం మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మిత్రులు బహిరంగంగా.. శత్రువులు అనుకున్నవారు అంతర్లీనంగా ఆయనకు నివాళులు అరిపిస్తున్నారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహనీయుడి కోసం కన్నీటి బొట్టు రాలుస్తున్నారు.
ఇదే సమయంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావోద్వేగంగా స్పందించారు. "నాన్నా... మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది" అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ చేశారు.
"నాన్నా... మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా" అని జగన్ స్పందించారు.
అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు. ఇందులో భాగంగా... సతీసమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్.. తల్లి వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదే క్రమంలో... తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి షర్మిల నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన తండ్రి జ్ఞాపకాలను షర్మిల గుర్తు చేసుకున్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన మహానేత వైఎస్ అని షర్మిల కొనియాడారు.