బీయారెస్ కే లాభం... షర్మిల సంచలన కామెంట్స్ ..!

అలా కాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోటీ వద్దు అనుకున్నామని కానీ కాంగ్రెస్ వైఖరితో ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని ఆమె అంటున్నారు

Update: 2023-10-12 11:55 GMT

వైఎసార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు లోటస్ పాండ్ లో మొత్తం తెలంగాణాలోని 33 జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశలో ఆమె ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలే చేశారు. వైఎసార్టీపీ పోటీ వల్ల బీయారెస్ కే రాజకీయ లాభం అని షర్మిల అంటున్నారు. మేము పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీ ఎత్తున చీలుతాయని ఆమె అన్నారు.

అలా కాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే పోటీ వద్దు అనుకున్నామని కానీ కాంగ్రెస్ వైఖరితో ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని ఆమె అంటున్నారు. అంటే విలీనం విషయంలో కాంగ్రెస్ పెద్దలు సరిగ్గా రియాక్ట్ కాకపోవడం పట్ల షర్మిల అప్ సెట్ అయ్యారని అంటున్నారు.

ఏకంగా 119 సీట్లకు పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయమని ఆమె చెప్పారు. తాను పాలేరుతో పాటు మరోచోట పోటీ చేస్తాను అని రెండవ సీటుని ఆమె చెప్పలేదు. ఇక తనతో పాటు తన తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తన భర్త అనిల్ కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అంటే షర్మిల కుటుంబానికే నాలుగు టికెట్లు అన్న మాట.

ఈ విధంగా తన కుటుంబం వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగాలన్నది పార్టీ క్యాడర్ కోరిక అని ఆమె చెప్పుకున్నారు. ఇక తొందరలోనే పార్టీ నుంచి ఎక్కడెక్కడ అభ్యర్థులు పోటీ చేస్తారు అన్న దాని మీద నిర్ణయాన్ని ప్రకటిస్తామని జాబితా కూడా విడుదల చేస్తామని షర్మిల అంటున్నారు.

ఇదిలా ఉంటే షర్మిల పార్తీ ఎన్నికల్లో పోటీలో ఉంటే అది బీయారెస్ కి రాజకీయ లాభం అంటూ చేసిన కామెంట్స్ మీద చర్చ సాగుతోంది. తెలంగాణాలో ఇపుడు బహుముఖ పోటీలే ఉన్నాయి. బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగుతోంది. అలగే టీడీపీ జనసేన కూడా పోటీ చేయనున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఇంకా మరిన్ని పార్టీలు కూడా పోటీకి తయారుగా ఉన్నాయని చెబుతున్నారు. అంటే బీయారెస్ కి ఇది లాభించే అంశమే అన్నది ఒక చర్చగా ఉంది. అయితే రాజకీయాల్లో లెక్కలు ఎపుడూ రెండు రెండూ నాలుగు కావు. అదే విధంగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కూటములు కట్టినా ప్రజలు నచ్చుకుంటే అధికార పార్టీనే ఎన్నుకుంటారు. లేకపోతే ఓట్లు చీలినా కూడా తాము అనుకున్న పార్టీ విపక్షంలో ఉన్నా ఎన్నుకుంటారు.

ఇది చాలా సార్లు రుజువు అయింది. 2019లో ఏపీలో వైసీపీ ఒక వైపు జనసేన కూటమి మరో వైపు పోటీ చేశాయి. అయినా జనాల ఫోకస్ అంతా వైసీపీ మీద ఉంది. దాంతో ఇతర పార్టీలకు డిపాజిట్లు పోయాయి. అందువల్ల షర్మిల తన పార్టీ తరఫున అభ్యర్ధులను నిలబెట్టినంతమాత్రాన అది కాంగ్రెస్ కి నష్టం అని బీయారెస్ కి రాజకీయ లాభం అని చెప్పడానికి వీలు లేదు అంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ ని బలంగా కోరుకుంటే మధ్యలో మరే పార్టీని కూడా చూడరని అంటున్నారు. సో షర్మిల చేసిన ఈ కామెంట్స్ కాంగ్రెస్ తో విలీనం కాలేదన్న దాని నుంచి వచ్చి ఉండవచ్చు అంటున్నారు.

Tags:    

Similar News