షర్మిల సూటి ప్రశ్నలకు జగన్‌ దగ్గర సమాధానం ఉందా?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కొత్త మలుపును తీసుకున్నాయి. ఓవైపు టీడీపీ, జనసేన శాసనసభ సమావేశాలతో బిజీగా ఉన్నాయి.

Update: 2024-07-25 11:20 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కొత్త మలుపును తీసుకున్నాయి. ఓవైపు టీడీపీ, జనసేన శాసనసభ సమావేశాలతో బిజీగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సభ ముందుకు తెస్తున్నాయి. మద్యం, మైనింగ్‌ వ్యవహారాల్లో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు డుమ్మా కొట్టి «ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 35 మంది వైసీపీ కార్యకర్తలను చంపారని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. దీనికి వివిధ పార్టీల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు.

ఓవైపు సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇంకోవైపు డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జగన్‌ కు ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల నుంచి అతిపెద్ద తలపోటు ఎదురవుతోంది.

వైఎస్‌ జగన్‌ పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు సాగిస్తున్నారు. టీడీపీ నేతలు దాడులు చేశారంటూ జగన్‌ ధర్నాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇవే ధర్నాలు, నిరసనలు.. తమ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపినప్పుడు ఎందుకు నిర్వహించలేదని జగన్‌ కు షర్మిల సూటిగా ప్రశ్నలు సంధించారు.

గత ఐదేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో, రైల్వే జోన్‌ విషయంలో, కడప స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంలో జగన్‌ ఒక్క రోజు కూడా ధర్నాలు ఎందుకు నిర్వహించలేదని షర్మిల ప్రశ్నించారు.

అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడైనా నిరసన వ్యక్తం చేశారా, రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లు ఏమీ చేయకపోయినా ఏనాడైనా గొంతెత్తారా అని షర్మిల శరపరంపరగా జగన్‌ కు ప్రశ్నలు సంధించారు.

ఇప్పుడు అధికారం కోల్పోవడం, వైసీపీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో ఎవరో ఒక వ్యక్తి హత్యను అడ్డంగా పెట్టుకుని రాజకీయాలు చేస్తారా అని షర్మిల మండిపడ్డారు.

పల్నాడు జిల్లా వినుకొండలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో కొట్టుకుని.. అందులో ఒకరు మరణిస్తే జగన్‌ శవ రాజకీయాలు చేస్తున్నారని షర్మిల దుయ్యబట్టారు. ఆయనకు శవ రాజకీయాలు అవసరమా అని ధ్వజమెత్తారు.

ఇటీవల ఎన్నికల ముందు వైసీపీ నుంచి పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ఎన్నికల్లో చిత్తవడంతో మరింత మంది పార్టీ మారే యోచనలో ఉన్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ వీరిని చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వారందరికీ షర్మిల నేతృత్వంలోని ఏపీ కాంగ్రెస్‌ ఆశాజనకంగా కనిపిస్తోంది. దీంతో వైఎస్‌ జగన్‌ కు తన సోదరి రూపంలోనే పెద్ద తలపోటు ఎదురవుతోంది. చంద్రబాబు, పవన్‌ సంగతి ఏమో కానీ.. ముందు షర్మిలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

Tags:    

Similar News