అన్నకు కౌంటర్.. చెల్లి వరద నిరసన: పరిశీలకుల మాట
ఏపీలో అన్నాచెల్లెళ్ల రాజకీయం రసవత్తరంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
ఏపీలో అన్నాచెల్లెళ్ల రాజకీయం రసవత్తరంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ప్రత్యక్షంగానే రాజకీయ పోరు ముదిరింది. ఎన్నికలకు ముం దు నుంచి జరుగుతున్న షర్మిల యాంటీ జగన్ రాజకీయం.. ఎన్నికల తర్వాత.. వైసీపీ చిత్తుగా ఓడిపోయి న తర్వాత కూడా కొనసాగుతోంది. వాస్తవానికి ఒక పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీని ఎవరూ పట్టించుకోరు. కానీ, ఇక్కడ వైసీపీని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తోందంటే.. ఆ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు రావడమే!
ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఉన్నందుకే.. ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే వైసీపీని షర్మిల టార్గెట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీలో ధర్నా చేస్తానని జగన్ ప్రకటించగానే మీడియా ముందుకు వచ్చిన షర్మిల.. అనూహ్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు.. ఎందుకు చేయలేదన్నారు. రాష్ట్రంలో హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు.. ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం ఎందుకు ధర్నా చేయ లేదన్నారు.
ఇక, ఇప్పుడు బుధవారం జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. తన పరివారంతో పాటు.. కలిసి వచ్చిన పార్టీలు.. నాయకులను కూడా ఆహ్వానించారు. ఇది ఒకపక్క సాగుతుండగానే.. దీనికి సంబంధించిన వార్తలు వస్తున్న సమయంలోనే.. షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేశారు. నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలైన పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుని..అక్కడి మోకాల్లోతు నీటిలో నిలబడి.. నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి జగన్ ధర్నాను ప్రచారం చేస్తున్న మీడియా .. ఒక్కసారిగా షర్మిలవైపు కెమెరాలు తిప్పేసింది.
ఆమె కొరుకున్నది కూడా.. ఇదే! జగన్ ధర్నాకు కౌంటర్‌గానే షర్మిల నిరసన వ్యక్తం చేశారనేది వాస్తవం. లేకపోతే.. ఆయా ప్రాంతాలు నీట మునిగి.. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టి కూడా.. మూడు రోజులు అయిపోయింది. మరి ఈ మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడని షర్మిల.. ఇప్పటికిప్పుడు వాటిపై ప్రేమ కురిపించడం.. అక్కడకు వెళ్లి కూడా..జగన్ సర్కారును టార్గెట్ చేయడం.. వంటివి చూస్తే.. ఆమె వ్యక్తిగత అజెండానే స్పష్టంగా కనిపిస్తోంది. సరే.. ఏదేమైనా.. రైతుల కోసం.. నడుములోతు నీటిలో మహిళా నాయకురాలు నిరసన వ్యక్తం చేశారు కాబట్టి మార్కులు అయితే పడుతున్నాయి.