ఎంపీ యూసుఫ్ పఠాన్.. గెలిపించి కసి తీర్చుకున్న దీదీ
టీమిండియా మాజీ ఆల్ రౌండర్, హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ అయిన యూసుఫ్ పఠాన్ తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయ్యాడు.
దేశానికి పశ్చిమాన ఉన్న ఎక్కడి వడోదర.. తూర్పున ఉన్న ఎక్కడి బెర్హంపూర్.. సరిగ్గా 2 వేల కిలోమీటర్ల దూరం... అసలు కల్చరల్ గా, భౌగోళికంగా, రాజకీయంగా దేంట్లోనూ పోలిక లేదు. కానీ, ఓ క్రికెటర్ రాజకీయ నాయకుడిగా మారి ఆ సరిహద్దులను చెరిపేశాడు. టీమిండియా టి20, వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సందర్భాల్లో జట్టులో సభ్యుడైన అతడు సరిగ్గా టి20 ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో ఎంపీగా గెలుపొందాడు. అంతేకాదు అతడి గెలుపులోనూ ఓ ప్రత్యేకత ఉంది.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్, హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ అయిన యూసుఫ్ పఠాన్ తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయ్యాడు. సిక్సులకు పేరొందిన అతడు పొలిటికల్ క్రీజులోకి దిగిన వెంటనే భారీ సిక్సర్ కొట్టాడు. పశ్చిమ బెంగాల్ లోని బహ్రంపూర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున యూసుఫ్ పఠాన్ గెలిచాడు. ఆయన ప్రత్యర్థి ఎవరో కాదు.. మొన్నటివరకు కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేతగా వ్యవహరించిన అధీర్ రంజన్ చౌదరి. పఠాన్ మొత్తం 85 వేల మెజారిటీతో గెలిచాడు.
ఐదుసార్లు విజేతను ఓడించి..
అధీర్ రంజన్ చౌధరి బహ్రంపూర్ నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. 25 ఏళ్ల తర్వాత ఆయన ఓడిపోయారు. అంతేకాదు.. ఇండియా కూటమిలో భాగం అయినప్పటికీ బెంగాల్ లో మమతా బెనర్జీని తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఆయనను ఎలాగైనా ఓడించాలని మమతా భావించినట్లున్నారు. ఈ సమయంలో యూసుఫ్ పఠాన్ రూపంలో ఓ అభ్యర్థి దొరికారు. బహ్రంపూర్ లో ముస్లిం జనాభా అధికం. కాంగ్రెస్ ఇన్నాళ్లుగా వారే ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఆ ఓట్లన్నీ యూసుఫ్ పఠాన్ కు పడ్డాయి.
కాగా, యూసుఫ్ పఠాన్ టీమిండియాకు 57 వన్డేలు, 22 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇతడి తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టి20ల్లో ఆడాడు. 42 ఏళ్ల యూసుఫ్ పఠాన్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగితే మంచి భవిష్యత్ ఉండే అవకాశం ఉంది.