సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ మరణం గుండెపోటుతోనా? తొక్కిసలాటతోనా?

సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ అకాల మరణం చెందారు

Update: 2023-08-08 05:47 GMT

ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియల సందర్భంగా మరో విషాదం చోటు చేసుకోవటం తెలిసిందే. గద్దర్ కు ప్రాణస్నేహితుడు.. సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ అకాల మరణం చెందారు. వయసులో పెద్దవాడైనప్పటికీ.. ఆయన ఎంతో యాక్టివ్ గా ఉంటారు. మజ్లిస్ అన్నా.. ఆ పార్టీ అధినేత అసుద్దీన్ ఓవైసీని.. ఆయన తరహా రాజకీయాల్ని అస్సలు ఇష్టపడని మేధోసంపన్నమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది.

మిత్రుడు గద్దర్ మరణం వేళ.. ఆయన అంతిమ యాత్రలో పక్కనే కిలోమీటర్లు ప్రయాణించి.. ఇంటి వద్దకు పార్దిప దేహం చేరుకున్న వేళ.. ఆయన ఛాతీ నొప్పికి గురయ్యారు. కాసేపటికే తుదిశ్వాస విడిచారు. కానీ.. ఆయన మరణం తొక్కిసలాట కారణంగా జరిగిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో.. ఆయన మరణం తొక్కిసలాటతో జరిగిందా? గుండెపోటు కారణమా? అన్నది ప్రశ్నగా మారింది.

గుండెపోటుకు గురైన తీవ్ర అస్వస్థతకు గురైన ఉదంతాన్ని తొక్కిసలాటగా ఎందుకు మారిందన్న విషయంలోకి లోతుగా వెళితే.. షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. ఈ ఉదంతాన్ని ప్రత్యక్షంగా చూసిన పలువురితో మాట్లాడిన తర్వాత వచ్చిన స్పష్టత ఏమంటే.. తొక్కిసలాటకు.. సియాసత్ ఎడిటర్ మరణానికి ఏ మాత్రం లింకు లేదు.

అంతిమయాత్రలో భాగంగా గద్దర్ ఇంటి వద్దకు వచ్చిన ఆయన.. అంత్యక్రియలు జరిగే మహాబోధి స్కూల్ వద్దకు వెళ్లటం.. అక్కడ ఉన్న ఆయనకు ఫోన్ రావటంతో పక్కకు వచ్చారు. ఈ క్రమంలో తీవ్రమైన ఛాతీనొప్పికి గురై కూలిపోయారు.

ఆ వెంటనే స్థానికులు ఆయన్ను సపర్యలు చేసి. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే పరిస్థితి విషమించింది. ఆ వెంటనే.. కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు గుర్తించారు. గుండెపోటుతో మరణించిన ఆయన్ను తొక్కిసలాటలో మరణించినట్లుగా ప్రచారం ఎందుకు జరిగిందంటే.. ఒక పేరుమోసిన టీవీ చానల్ కు చెందిన రిపోర్టర్ చేసిన తప్పు.. ఈ మొత్తం కంగాళీకి కారణంగా చెప్పాలి.

సరిగా క్రాస్ చెక్ చేసుకోకుండా.. తొక్కిసలాటకు గురై.. గుండెపోటు వచ్చిందని.. ఆయన మరణించారన్న సమాచారాన్ని.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినట్లుగా బ్రేకింగ్ న్యూస్ వేయటం.. మిగిలిన చానళ్లు దాన్ని ఫాలో కావటంతో.. నిజం వెనక్కి వెళ్లిపోయి.. తప్పుడు సమాచారం ముందుకు వచ్చింది.

ఇదే సమయంలో ఒక ప్రముఖ వార్తా యాప్ లోనూ ఇదే సమాచారంతో వార్త రావటం.. దాన్ని అందరూ షేర్ చేసుకోవటంతో విషయం పూర్తిగా పక్కదారి పట్టినట్లైంది. దీంతో.. ఛాతీ నొప్పితో మరణించిన ప్రముఖుడ్ని.. తొక్కిసలాటలో మరణించినట్లుగా వార్తలు వచ్చేశాయి.

ఇక.. మరణించిన సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ విషయానికి వస్తే.. కోట్లాది రూపాయిల సొంత ఖర్చుతో విద్యార్థులకు విద్య.. వందలాది మంది పేదలకు పెళ్లిళ్లు చేయించటంతో పాటు.. కష్టంలో ఉన్న వారికి అండగానిలిచే ఒక మైనార్టీ మేధావి మనందరికి దూరమయ్యారు. కాకుంటే.. ఆయన గొప్పతనాన్ని తెలుగు పేపర్లు సైతం పెద్దగా పట్టకపోవటం అన్నింటికి మించిన అతి పెద్ద బ్యాడ్ లక్ గా చెప్పాలి.

Tags:    

Similar News