బుష్ - ఒబామా వీడియో... లిప్ రీడర్ డీకోడ్ లో ఇంట్రస్టింగ్ విషయం!
ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం వేళ తెరపైకి వచ్చిన ఓ వీడియో సంభషణ ఇప్పుడు డీకోడ్ అయ్యింది.. వైరల్ గా మారింది.
అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అనంతరం తనదైన మార్కు నిర్ణయాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలకు షాకిచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం వేళ తెరపైకి వచ్చిన ఓ వీడియో సంభషణ ఇప్పుడు డీకోడ్ అయ్యింది.. వైరల్ గా మారింది.
అవును.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీంతో... రెండో సారి అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినట్లయ్యింది. ఈ సందర్భంగా జరిగిన ప్రమాణస్వీకరణ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేయడం మొదలుపెట్టింది.
దీంతో... డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకరణ కార్యక్రమంలో వీరిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు..? అనే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో వారి మధ్య జరిగిన సంభాషణను లిప్ రీడర్ జాకీ గోంజాలేజ్ డీకోడ్ చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలొస్తున్నాయి.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇందులో భాగంగా... వినికిడి లోపంతో ఉన్న లిప్ రీడర్ జాకీ గోంజాలేజ్... సెలబ్రెటీలు, ప్రముఖుల మధ్య జరిగే ప్రైవేటు సంభాషణను డీకోడ్ చేస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న మాజీ ప్రెసిడెంట్స్ జార్జ్ బుష్, ఒబామా మధ్య జరిగిన సంభాషణను డీకోడ్ చేశారు.
ఈ క్రమంలో... ముందుగా ఒబామా అక్కడే ఉన్న జార్జ్ బుష్ ను పలకరించారు. ఈ సందర్భంగా "మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది" (గుడ్ టు సీ యూ) అని అన్నారు.. అనంతరం తన రాకపై వ్యక్తమైన అభిమానుల హర్షానికి "థాంక్యూ" అని చెప్పిన ఒబామా.. అనంతరం బుష్ తో... "ఇక్కడ జరిగేదాన్ని మనం ఆపగలమా? (హౌ కెన్ వియ్ స్టాప్ వాట్స్ హ్యాపెనింగ్..?) అని అన్నట్లు జాకీ తెలిపారు.
దీనికి సంబంధించి ఆమె చేసిన డీకోడింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక కామెంట్ సెక్షన్స్ లో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... "ఆశ్చర్యపోనక్కరలేదు.. ఇదే చర్చ వీరిద్దరి మధ్య చాలా సార్లు జరిగి ఉంటుంది" అని చెబుతూ జాకీ గోంజాలేజ్ ను అభినందిస్తూ ఒక యూజర్ స్పందించారు.