మా వాళ్లను అవమానించారు.. ఇంటర్వ్యూ ఇవ్వను..టెన్నిస్ గ్రేట్ నిర్ణయం
కొన్ని టోర్నమెంట్ల నుంచి తనను ఇబ్బంది పెడుతున్న, ఓడిస్తున్న కార్లొస్ అల్కరాజ్ ను మట్టికరిపించి సెమీ ఫైనల్ కు చేరాడు.
మరొక్క గ్రాండ్ స్లామ్..అంతే.. అతడు చరిత్రలో నిలిచిపోతాడు.. మరొక్క టైటిల్.. తన సమకాలీనులందరినీ వెనక్కునెడతాడు.. మరొక్కసారి చాంపియన్.. ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచిపోతాడు.. అలాంటి అరుదైన సందర్భం ముంగిట ఉన్నాడు సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జకో టైటిల్ వైపు దూసుకెళ్తున్నాడు. కొన్ని టోర్నమెంట్ల నుంచి తనను ఇబ్బంది పెడుతున్న, ఓడిస్తున్న కార్లొస్ అల్కరాజ్ ను మట్టికరిపించి సెమీ ఫైనల్ కు చేరాడు.
బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జకో.. 3.37 గంటల పాటు పోరాడి అల్క రాజ్ ను ఇంటిదారి పట్టించాడు. ఆస్ట్రేలియా టైమ్ ప్రకారం అర్థరాత్రి దాటాక కూడా జరిగిన ఈ మ్యాచ్ అనంతరం అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూనే.. ఇద్దరు పిల్లల తండ్రిగా బాధ్యత చాటాడు. మ్యాచ్ ను జకో భార్య జెలెనా, కొడుకు స్టీఫెన్, కుమార్తె తార వీక్షించారు. మ్యాచ్ గెలిచాక.. గాయాల నుంచి కోలుకుని ఎలా సాధన చేస్తున్నారంటూ మీడియా అడగ్గా.. కుమారుడు, కుమార్తెను చూసిన సమాధానం మధ్యలోనే ఆపేశాడు. వారు నిద్రపోయే సమయం దాటిపోయిందని చెప్పాడు. మీరు ఎప్పుడు నిద్ర పోతారు? అని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీంతో అతడి పిల్లలే కాక అభిమానులూ నవ్వులు చిందించారు.
జకోవిచ్ సెమీ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ తో తలపడనున్నాడు. ఫైనల్లోనూ గెలిచి టైటిల్ కొడితే జకోవిచ్చ 25వ గ్రాండ్ స్లామ్ తో చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం 24 గ్రాండ్ స్లామ్ లతో అతడు మహిళా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ తో సమానంగా ఉన్నాడు.
కొసమెరుపు: అల్కరాజ్ పై గెలిచాక ఆస్ట్రేలియా మీడియాతో మాట్లాడేందుకు జకో నిరాకరించాడు. కారణం.. తమ దేశస్తులైన సెర్బియన్లను అవమానించిందంటూ ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దీంతో ఆసీస్ మీడియా జకోకు వ్యతిరేకంగా మారింది. టైటిల్ కొట్టడంతోనే వారికి జవాబివ్వాలని చూస్తున్నాడు.