లోకల్ కంపెనీల కోసం దావోస్ వరకు వెళ్లాలా?
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ లిమిటెడ్ కేరాఫ్ హైదరాబాద్, గ్రీన్ కో కంపెనీ కేరాఫ్ ఏపీ.. ఈ రెండు సంస్థల కోసం తెలియని తెలుగు వారు ఉండరు
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ లిమిటెడ్ కేరాఫ్ హైదరాబాద్, గ్రీన్ కో కంపెనీ కేరాఫ్ ఏపీ.. ఈ రెండు సంస్థల కోసం తెలియని తెలుగు వారు ఉండరు. ఈ కంపెనీలు స్థానికంగా పెట్టుబడులు పెట్టాలంటే అమరావతిలోనో హైదరాబాదులోనూ ముఖ్యమంత్రులను కలిసి ఎంవోయూలు చేసుకోవచ్చు. కానీ, ఈ రెండు సంస్థలు దావోస్ వరకు వెళ్లి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. దీంతో స్థానిక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు దావోస్ వరకు వెళ్లాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నిజానికి ఇలాంటి ఒప్పందాలు ఇప్పుడే కాదు. ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళుతున్న మన నేతలు.. అక్కడి వెళ్లాక స్థానిక కంపెనీలతో ఒప్పందాలు చేసుకోడానికే పరిమితమవుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం మూడు ఒప్పందాలు చేసుకోగా, గ్రీన్ కో లిమిటెడుతో ఏపీ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీల ప్రతినిధులు తమ ఆసక్తిని వెల్లడిస్తే స్థానికంగానే ఈ ఎంవోయూలు చేసుకోవచ్చని, కోట్ల రూపాయల ఖర్చుతో అంతదూరం ఎందుకు వెళ్లాల్సివచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
దావోసులో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో మూడు ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ప్రధానమైనది రూ.11 వేల కోట్లతో 2,160 మెగావాట్ల పంపుడ్ స్టోరీజీ ప్రాజెక్ట్ ఒకటి. రెండోది వెయ్యి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో అనంతగిరిలో లగ్జరీ వెల్‌నెస్ రిసార్ట్ ఏర్పాటు మేఘాతోనే మరో ఒప్పందం కుదిరింది. అదేవిధంగా బెంగళూరు కేంద్రంగా పనిచేసేసే CtrlS డేటా సెంటర్స్ లిమిటెడ్‌తో AI డేటా సెంటర్ ఏర్పాటు కూడా అవగాహన ఒప్పందం కుదిరింది. వాస్తవానికి MEIL, CtrlS రెండూ హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నవే.. ఈ కంపెనీల ప్రమోటర్లు అనుకుంటే రాష్ట్ర సచివాలయంలోనే ముఖ్యమంత్రిని సంప్రదించవచ్చు. ఇందుకోసం దావోస్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తుంది.
అదేవిధంగా ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కోసం గ్రీన్‌కోతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. గ్రీన్‌కో ఆంధ్రాకు చెందిన కంపెనీ. దీని యజమాని గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలో పనిచేశారు. ఆయనకు ఇప్పటికీ టీడీపీ, జనసేన నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఆయన కంపెనీ పెడతానంటే కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం చెబుతుంది. కానీ, దావోస్ వెళ్లి ఎందుకు వెళ్లాల్సివచ్చిందని విపక్షం ప్రశ్నిస్తోంది. ఇదే విమర్శలు గతంలో వైసీపీ అధికారంలో ఉండగా వచ్చాయి. 2022లో దావోస్ వెళ్లిన అప్పటి సీఎం జగన్ స్థానిక కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకున్నారని విపక్ష హోదాలో టీడీపీ విమర్శించింది. మొత్తానికి పాత్రలు మారినా అవే సన్నివేశాలు కనిపించడంపై నెట్టింట హాట్ టాపిక్ నడుస్తోంది.