అమరావతి.. 'ఏఐ సిటీ ఆఫ్ ఇండియా' !
అమరావతిని `ఏఐ సిటీ ఆఫ్ ఇండియా`గా మార్చాలని విజనరీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిపారు.
దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్.. ఏపీకి పెట్టుబడులు దూసుకు వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తుందని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై బెల్వడేర్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా ఏపీలో ఏఐకి ఉన్న అవకాశాలను ఆయన సమగ్రంగా వివరించా రు. అమరావతిని `ఏఐ సిటీ ఆఫ్ ఇండియా`గా మార్చాలని విజనరీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిపారు. విశాఖలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి ఎన్‌వీఐడీఐఏతో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలిపారు.
ఏఐ విశ్వవిద్యాలయం పరిశోధనలను మరింత విస్తృతం చేస్తుందని నారా లోకేష్ వివరించారు. ఏపీలో ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటులో భాగంగా ప్రముఖ సంస్థలతో టచ్ లో ఉన్నామని వివరించారు. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ లను రప్పించడంలో సీఎం చంద్రబాబుకు విజయవంతమైన చరిత్ర ఉందని గత అనుభవాలను ఆయన వివరించారు. హైదరాబాద్ కి ఐఎస్ బీ తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని నారా లోకేష్ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 2వేలకు పైగా గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని, దేశంలో అతిపెద్ద నైపుణ్య ఉన్న ఉద్యోగులు, యువత ఉన్నారని తెలిపారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఏఐ, ఎంఎల్ లో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని నారా లోకేష్ వివరించారు. భవిష్యత్తులో విద్యార్థుల్లో ఏఐ నైపుణ్యాలను పెంపొందించడానికి 7నుంచి 9వతరగతి వరకు పాఠశాల పాఠ్యాంశాల్లో ఏఐని ప్రవేశపెట్టబోతున్నట్టు పేర్కొన్నారు. పింఛనుదారుల గుర్తింపు, పెన్షన్‌ల పంపిణీ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ఎఐని వినియోగించి రైతులకు అవసరమైన సందేశాలు పంపడం ద్వారా పంట ఉత్పాదకతను పెంచుతున్న విషయాన్ని సమగ్రంగా వివరించారు. భవిష్యత్తులో ఏఐ ఆధారిత ఆవిష్కరణలను కొనసాగించేందుకు దీర్ఘకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు.
భారత్ పైనా అమోఘ ఆశలు..
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఏఐ మార్కెట్ కు అనుగుణంగా ఏఐ డాటా సెంటర్లకు రాబోయే రోజుల్లో డిమాండ్ పెరగనుందని లోకేష్ తెలిపారు. 2030 నాటికి గ్లోబల్ ఏఐ మార్కెట్ 1.6 ట్రిలియన్లకు, 2032కు 2.74 ట్రిలియన్లకు చేరనుందని తెలిపారు. 2030నాటికి గ్లోబల్ డాటా సెంటర్స్ డిమాండ్ సగటున 19 నుంచి 22శాతంతో 219 గిగావాట్లకు ఉండొవచ్చని పేర్కొన్నారు. డాటా సెంటర్ల మార్కెట్ లో 40శాతం వాటాతో నార్త్ అమెరికా(1000 డాటా సెంటర్లు) ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, అయితే.. ప్రస్తుతం 1మిలియన్ ఏఐ వృత్తినిపుణుల కొరత ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీని కూడా ఏఐలో అగ్రగామిగా నిలిపే ప్రయత్నాలు సాగుతున్నట్టు వివరించారు.