మోడీ ట్రంప్ భేటీకి ముహూర్తం ఫిక్స్

అమెరికా 47వ అధ్యక్షుడిగా తాజాగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎపుడు కలుస్తారు అన్న చర్చ మొదలైంది.

Update: 2025-01-23 03:36 GMT

అమెరికా 47వ అధ్యక్షుడిగా తాజాగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎపుడు కలుస్తారు అన్న చర్చ మొదలైంది. ట్రంప్ ప్రమాణానికి కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ అతిధిగా హాజరై వచ్చారు. ఇక వివిధ దేశాలకు చెందిన నాయకులు కూడా ట్రంప్ ప్రమాణంలో పాల్గొన్నారు.

నరేంద్ర మోడీ అయితే సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శ్రేయస్సుకు ప్రజాస్వామ్య పరిరక్షణకు అభివృద్ధికి రెండు దేశాలూ కలసి పనిచేయాలని మోడీ కోరుకున్నారు. మోడీ ట్రంప్ ల మధ్య స్నేహం ఈనాటిది కాదు. 2020లో ట్రంప్ రెండోసారి పోటీ చేస్తే మోడీ ఆయన కోసం ప్రవాస భారతీయుల మద్దతు పొందేలా తన వంతుగా కృషి చేశారు ని చెబుతారు.

ఇక మోడీ 2014లో ప్రధాని అయితే ట్రంప్ 2016లో అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన నాలుగేళ్ళ పాలనలో మోడీ డొనాల్డ్ ట్రంప్ ని భారత్ కి తీసుకుని వచ్చారు. తన సొంత రాష్ట్రం గుజరాత్ లో ఘన స్వాగతం దక్కేలా చూశారు. ఇక మోడీ సైతం అమెరికా పర్యటనలు చేసినపుడు ట్రంప్ అదే విధంగా రెడ్ కార్పెట్ పరచారు.

ఈ ఇద్దరూ అపూర్వ మిత్రులుగా ప్రపంచ వర్తమాన రాజకీయాలలో మెలిగారు. ఇపుడు మోడీ మూడోసారి భారత్ కి ప్రధానిగా ఉన్నారు. ట్రంప్ అయితే రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు. ఈ ఇద్దరూ ఇపుడు తొలిగా భేటీ అయ్యే ముహూర్తం ఫిక్స్ అయింది అని అంటున్నారు.

ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ లో ట్రంప్ మోడీ తొలి సమావేశానికి రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. ఈ మేరకు భారత్ అమెరికా దౌత్య వేత్తలు ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే చైనాను కట్టడి చేయడానికి భారత్ తో బలమైన బంధానికి వ్యూహాత్మకంగా అమెరికా తెర తీస్తోంది అని అంటున్నారు. భారత్ విషయానికి వస్తే వాణిజ్య సంబంధాలను అమెరికాతో పెంపొందించుకోవాలని చూస్తోంది. ఇలా ఉభయ దేశాలూ పరస్పరం అవగాహనతో ముందుకు సాగాల్సి ఉందని భావిస్తున్నాయి.

అయితే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కాగానే భారత్ పైన సుంకాలు విధించడం చర్చకు తావిస్తోంది. దీని మీద రెండు దేశాలు కలసి చర్చించుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్ ఈసారి దూకుడుగానే ఉంటారని తేలిపోతోంది. అదే సమయంలో భారత్ కూడా తన ప్రయోజనాల విషయంలో రాజీ లేకుండానే అమెరికాతో స్నేహ బంధాన్ని గట్టి చేసుకోవాలని చూస్తోందని దౌత్య రంగ నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News