'ప్రాణానికి తక్షణ ముప్పు'... కాలిఫోర్నియాలో కొత్త రాక్షస మంటలు!
లాస్ ఏంజెలెస్ కు ఉత్తరాన్న 80 కిలో మీటర్ల దూరంలో కొత్త అడవి మంటలు చెలరేగాయి. ఇవి 8,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించాయి.
లాస్ ఏంజెలెస్ కలలో కూడా ఊహించని పెను విపత్తును ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అక్కడ పుట్టిన అడవి మంటల ఫలితంగా కొన్ని లక్షల కోట్ల మంది నిరాశ్రయులవ్వగా.. వేల నిర్మాణాలు బూడిదయ్యాయి. ఇక ఆస్తి నష్టం లక్షల కోట్లలో అంచనా వేయబడింది. ఈ సమయంలో మరోసారి కొత్త అటవీ మంటలు బుధవారం చెలరేగాయి.
అవును... లాస్ ఏంజెలెస్ కు ఉత్తరాన్న 80 కిలో మీటర్ల దూరంలో కొత్త అడవి మంటలు చెలరేగాయి. ఇవి 8,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించాయి. ఈ సమయంలో ఈ మంటలు, బలమైన గాలుల వల్ల సుమారు 19,000 కంటే ఎక్కువ మందిని తప్పనిసరిగా తరలించాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. లాస్ ఏంజెలెస్ కౌంటీలోని కాస్టయిక్ లేక్ ప్రాంత ప్రజల ప్రాణానికి తక్షణ ముప్పును ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఇదే సమయంలో.. దక్షిణ కాలిఫోర్నియాలోని ఎక్కువ భాగం బలమైన, పొడి గాలుల కారణంగా తీవ్రమైన అగ్ని ప్రమాదానికి సంబంధించి రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు జారీ అయ్యాయని అంటున్నారు.
ఈ సందర్భంగా కాస్టాయిక్ కమ్యూనిటీ నుంచి 19,000 మంది ప్రజలు తప్పనిసరి తరలింపు ఆదేశాలు అందుకోగా.. మరో 16,000 మంది కూడా తరలింపు హెచ్చరికల్లో ఉన్నారని అగ్నిమాపక విభాగం తెలిపింది. ఈ సమయంలో సౌత్ కాలిఫోర్నియా చుట్టూ సుమారు 1100 మంది అగ్నిమాపక సిబ్బందిని మొహరించినట్లు చెబుతున్నారు.
ఈ మేరకు కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ తెలిపింది. వాస్తవానికి దక్షిణ కాలిఫోర్నియాలో సుమరు తొమ్మిది నెలలుగా చెప్పుకోదగ్గ వర్షం లేకుండా పోయిందని.. ఇది ప్రమదకర పరిస్థితులకు దోహదపదిందని.. అయితే... రాబోయే శనివారం నుంచి సోమవారం వరకూ కొంత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా.. జనవరి 7న చెలరేగిన రెండు మంటలు లాస్ ఏంజెలెస్ లో మెజారిటీ ప్రాంతాన్ని బూడిద చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చు ఫలితంగా 28 మంది చనిపోగా, సుమారు 16,000 నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఇక లాస్ ఏంజెలెస్ కౌంటీ అధికారుల ప్రకారం... సుమారు 2 లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతం నుంచి తట్టా బుట్టా సర్దుకుని తరలివెళ్లారు.