సైబర్ నేరం వేళ నగదు ఫ్రీజ్ పై మద్రాసు హైకోర్టు కీలక తీర్పు

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు కామన్ గా మారటం తెలిసిందే.

Update: 2024-09-17 23:30 GMT

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు కామన్ గా మారటం తెలిసిందే. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న వారు ఎక్కువయ్యే కొద్దీ ఈ నేరాలు అంతకంతకూ పెరుగుతుండే పరిస్థితి. ఆశ.. భయం.. అనే రెండు అంశాల్ని ప్రాతిపదికగా చేసుకొని సైబర్ బందిపోట్లు చెలరేగిపోతున్నారు. అమాయకుల్ని నిండుగా ముంచేస్తున్నారు. సైబర్ బందిపోట్ల ఆగడాలకు చెక్ పెట్టే విషయంలో ప్రభుత్వాలు స్పందించాల్సినంత ఎక్కువగా స్పందించని పరిస్థితి నెలకొందన్న విమర్శ వినిపిస్తోంది. నిజానికి ఇప్పుడు జరుగుతున్న నేరాల తీవ్రతను చూసినప్పుడు సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సి ఉన్నా.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్న పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సైబర్ నేరం జరిగిన వేళ.. బాధితులు పడే ఇబ్బందులు కొన్నైతే.. కొందరికి ఎలాంటి సంబంధం లేకున్నా.. ఇరుక్కుపోయి విలవిలలాడే పరిస్థితి. సైబర్ నేరగాళ్లు.. ఎవరైనా బాధితుడికి కొద్దిపాటి మొత్తాన్ని పంపినా.. ఆ ఖాతాను ఫ్రీజ్ చేస్తున్న వైనంతో విలవిలలాడిపోతున్నారు. దీనికి కారణం.. సైబర్ బందిపోట్లు కొన్ని సందర్భాల్లో బాధితులకు ఒక రూపాయి మొత్తాన్నిశాంపిల్ గా పంపి.. తమకుతిరిగి పంపమని కోరతారు. వారిని నమ్మిన వారుతమ డబ్బంతా పోగొట్టుకొనే పరిస్థితి. ఇలాంటి వేళ.. నేరస్తుల బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసే క్రమంలో బాధితులకు.. సైబర్ నేరస్తుల నుంచి వచ్చిన రూపాయిని చూపించి.. వారి ఖాతాల్ని ఫ్రీజ్ చేస్తున్న దుస్థితి.

దీనిపై తాజాగా మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎంత నగదు బదిలీ అయ్యిందో అంత మొత్తాన్ని మాత్రమే ఫ్రీజ్ చేయాలని.. అంతే తప్పించి.. ఖతా మొత్తాన్ని ఫ్రీజ్ చేయటంలో అర్థం లేదని పేర్కొంది. ఇంతకూ ఆ కేసుకు సంబంధించిన లింకుల్లోకి వెళితే.. హైదరాబాద్ లింకు ఉండటం గమనార్హం. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరిన ఉచ్చులో హైదరాబాద్ కు చెందిన బాధితుడు చిక్కాడు. సర్వం కోల్పోయాడు.

అయితే.. సైబర్ నేరగాళ్లు తమిళనాడులోని తిరువల్లూర్కు చెందిన షఫియుల్లా అనే వ్యక్తి ఖాతాకు రూ.2.48 లక్షలు బదిలీ చేశాడు. అతని బ్యాంకు ఖాతాలో అప్పటికే రూ.9.69 లక్షలు ఉన్నాయి.విచారణలో భాగంగా పోలీసులు అతడి మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేవారు. ఏడాది పాటు పోలీసుల చుట్టూ.. బ్యాంకుల చుట్టు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో.. షఫియుల్లా హైకోర్టును ఆశ్రయించాడు. ఇరు పక్షాల వాదన విన్న కోర్టు.. రూ.2.48 లక్షల మొత్తాన్ని మాత్రమే ఫ్రీజ్ చేసి.. అతడి బ్యాంకు ఖాతాను పునరుద్ధరించారని ఆదేశించింది.

ఇదే తరహాలో హైదరాబాద్ లోనూ పలువురు బాధితుల ఖాతాలు ఫ్రీజ్ అయి ఉన్నాయి. పెట్రోల్ బంకులు.. టీకొట్టు.. చిన్న చిన్న షాపుల వారికి రూ.100 లోపు మొత్తంలో బదిలీ అయిన ఉదంతాల్లో సైబర్ నేరాలతో సంబంధం ఉన్న వారి ఖాతా నుంచి డబ్బులు (చిన్న మొత్తంలో) వచ్చినా.. వారి మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేస్తున్నారు. దీంతో.. పలువురు విలవిలలాడిపోతున్నారు. ఇలాంటి వారి సంఖ్య వందల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇలాంటి బాధితులకు మద్రాస్ హైకోర్టు తీర్పు సాంత్వన లభించే వీలుంది. ఈ కోర్టు తీర్పునకు తగ్గట్లే.. పోలీసులు.. బ్యాంకులు స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News