సుప్రీం చెప్పినట్లు బాండ్ల రద్దు ఓకే.. మరి దాని సంగతేంటి?

ముంగిట్లోకి లోక్ సభ ఎన్నికలు వచ్చేసిన వేళలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

Update: 2024-02-16 13:30 GMT

ముంగిట్లోకి లోక్ సభ ఎన్నికలు వచ్చేసిన వేళలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తీర్పు ప్రకంపనలు రాజకీయ పార్టీలకే పరిమితం కాలేదు.. వారికి విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ ప్రముఖుల్లోనూ కొత్త చర్చకు తెర తీసింది. వారు ఒక కీలక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును తాము వ్యతిరేకించటం లేదని.. తమకు ఎదురయ్యే ఇబ్బందిని వారిప్పుడు ప్రశ్నిస్తున్నారు.

ఎలక్టోరల్ బాండ్లనురద్దు చేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పులో ప్రస్తావించిన కొన్ని అంశాలు రానున్న రోజుల్లో తమకు కొత్త ఇబ్బందుల్ని తెచ్చి పెడతాయని వాపోతున్నారు. ‘ఈ పథకం కింద ఇప్పటివరకు బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు.. బాండ్ల విలువ.. వాటిని స్వీకరించిన పార్టీ వివరాల్ని వెల్లడించాలి. 2019 ఏప్రిల్ 12 నుంచి విక్రయించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాల్ని మార్చి 6 లోపు ఎన్నికల సంఘానికి ఆదేశించాలి. వాటి వివరాల్నిమార్చి 13 లోపు వెబ్ సైట్ లో ఉంచాలి’’ అంటూ ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.

మోడీ సర్కారు చేసిన చట్టం ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంస్థలు.. అవి ఇచ్చిన పార్టీల వివరాలు బయటకు రావని.. వాటిని గుట్టుగా ఉంచుతామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ వివరాలు బయటకు రావటం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్నది వారి ఆవేదన. ప్రభుత్వం చట్టం చేసి.. చట్టబద్ధమైన భద్రత ఉంటుందని హామీ ఇచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు రావటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

సుప్రీంతీర్పు ప్రకారం కనుక తమ వివరాలు పబ్లిక్ డొమైన్ లోకి వస్తే తమ గోప్యత మాటేమిటి? అన్నది వారి ప్రశ్న. ఇలా జరిగితే.. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు ఇచ్చే హామీని.. వారి మాటకు చట్టపరమైన భద్రత ఎంతన్నది మరో ప్రశ్నగా చెబుతున్నారు. ప్రభుత్వం ఒక మాట ఇచ్చిన తర్వాత దానిని అమలు చేయాల్సిన అవసరం ఉంటుందన్న వాదనను వినిపిస్తున్నారు. మరి.. దీనిపై ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News