అమెరికాలో మరో విషాదం.. ఈసారి భారతీయ కుటుంబం!

తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్లెసాంటన్‌ లో జరిగిన ఒక కారు ప్రమాదంలో భారతీయ అమెరికన్‌ కుటుంబం మృతి చెందింది.

Update: 2024-04-27 06:26 GMT

అమెరికాలో భారతీయుల వరుస మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుల వ్యవధిలోనే వరుసగా వివిధ ప్రమాదాల్లో లేదా హత్యలకు గురై భారతీయులు మృతి చెందుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది భారతీయులకు అసలు అచ్చిరాలేదు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే అమెరికాలో పదుల సంఖ్యలో భారతీయులు మృత్యువాత పడ్డారు.

తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్లెసాంటన్‌ లో జరిగిన ఒక కారు ప్రమాదంలో భారతీయ అమెరికన్‌ కుటుంబం మృతి చెందింది. ఈ విషాద ఘటనలో భార్య, భర్త, వారి ఇద్దరు కుమారులు మృత్యువాత పడటం సర్వత్రా విషాదాన్ని నింపింది.

అమెరికా కాలమానం ప్రకారం.. ఏప్రిల్‌ 26 రాత్రి ఘటన జరిగింది. ప్లెసాంటన్‌ లో స్టోన్‌ రిడ్జ్‌ డ్రైవ్‌ సమీపంలోని ఫుట్‌ హిల్‌ రోడ్‌ లో వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయింది.

భారతీయ అమెరికన్‌ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదం తర్వాత మంటల్లో చిక్కుకుంది. అందులోనూ అది ఎలక్ట్రికల్‌ కారు కావడంతో మంటలు త్వరగా రాజుకున్నాయి.

బాధితులను తరుణ్‌ జార్జ్, ఆయన భార్య, వారి ఇద్దరు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. వారిది కేరళలోని తిరువల్ల అని తెలుస్తోంది. తరుణ్‌ జార్జ్‌ కాలిఫోర్నియా ప్రాంతంలో ఒక టెక్‌ కంపెనీలో సాఫ్టువేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్నారు.

పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కారును అతివేగంగా నడపటం లేదా మద్యం తాగి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ప్లెశాంటన్‌ పోలీస్‌ విభాగం ప్రమాద ఘటనపై ఒక ప్రకటన విడుదల చేసింది. తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఘటనపై ప్రస్తుతానికి తమ వద్ద అదనపు సమాచారం ఏమీ లేదని వెల్లడించింది. దర్యాప్తు పూర్తయ్యాక ప్రమాదానికి పూర్తి కారణాలను వెల్లడిస్తామని పేర్కొంది.

కాగా ప్లెసాంటన్‌ అమెరికాలో పెద్ద నగరాల్లో ఒకటైన శాన్‌ ఫ్రాన్సిస్కోకు తూర్పున దాదాపు 40 మైళ్ల దూరంలో ఉంది. తరుణ్‌ జార్జ్‌ పిల్లలు చదువుతున్న ప్లెసాంటన్‌ యూనిఫైడ్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

మరోవైపు తరుణ్‌ జార్జ్‌ స్నేహితులు, తోటి ఉద్యోగులు, కుటుంబ సన్నిహితులు అతడి కుటుంబానికి కన్నీటి నివాళులు అర్పించారు.

Tags:    

Similar News