అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ముగ్గురు మృతి!
అమెరికాలోని తెలుగువారి విషయంలో మరో దారుణం చోటు చేసుకుంది! సోమవారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
అమెరికాలోని తెలుగువారి విషయంలో మరో దారుణం చోటు చేసుకుంది! సోమవారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతిచెందారు. వీరిలో ఓ మహిళతో సహా ముగ్గురు ఆంధ్రులు ఉన్నారు. ఈ ముగ్గురూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారని తెలుస్తోంది.
అవును... అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ బాన్ హూం కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో రెండు వాహనలు ఢీకొన్నట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో టెక్సాస్ పోలీసులు అధికారికంగా మృతుల పేర్లను విడుదల చేయలేదు కానీ... అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం... మృతుల పేర్లు గోపి, శివ, హరితలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అమెరికా మీడియా ప్రకారం... కౌంటీలో ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం ఈ నెలలో ఇది రెండవసారి!
ఈ ప్రమాదంపై అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలోని మృతులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మృతురాలు హరిత భర్త సాయి తీవ్రగాయాలతో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
కాగా... గత నెలలో టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరితో పాటు తమిళనాడుకు చెందిన మరొకరు మృతి చెందారు. వీరంతా కలిసి కార్ పూలింగ్ లో బెన్ టోన్ విల్లే ప్రాంతానికి వెళ్లేందుకు ఓ వాహనంలో బయలుదేరగా ప్రమాదం జరిగింది.