మరో కిరాతకం.. భారతీయుడిని కొట్టి చంపేశాడు!

వీరిలో ఎక్కువ మంది హత్యకు గురయినవారే కావడం గమనార్హం.

Update: 2024-06-26 10:06 GMT

అమెరికాలో భారతీయులపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. వరుస దాడులు, కాల్పులతో భారతీయుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 15 మంది భారతీయులు అమెరికాలో మృత్యువాతపడ్డారు. వీరిలో ఎక్కువ మంది హత్యకు గురయినవారే కావడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం అమెరికాలోని డల్లాస్‌ లో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన తెలుగు యువకుడు గోపీకృష్ణ హత్యకు గురయిన ఘటనను ఇంకా ఎవరూ మరిచిపోకముందే మరో భారతీయుడు హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఓక్లహోమాలో హోటల్‌ పార్కింగ్‌ స్థలంలో 59 ఏళ్ల భారతీయ–అమెరికన్‌ వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టి చంపేశాడు. బాధితుడు గుజరాత్‌ కు చెందిన హేమంత్‌ శాంతిలాల్‌ మిస్ట్రీ. ఆయన ఒక హోటల్‌ మేనేజర్‌ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పార్కింగ్‌ లో ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి ఖాళీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో నిందితుడు 41 ఏళ్ల రిచర్డ్‌ లూయిస్‌.. హేమంత్‌ ముఖంపై చేత్తో గట్టిగా కొట్టాడు. దీంతో ఆయన ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయారు.

ఈ సంఘటన అమెరికా కాలమానం ప్రకారం.. జూన్‌ 22 శనివారం అర్థరాత్రి, ఇంటర్‌ స్టేట్‌ 40, మెరిడియన్‌ అవెన్యూ సమీపంలో జరిగిందని అమెరికా పోలీసులు వెల్లడించారు.

కాగా హేమంత్‌ శాంతిలాల్‌ మిస్త్రీపై రిచర్డ్‌ లూయిస్‌ చేసిన దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ వీడియోలో.. మృతుడు హేమంత్‌ మిస్త్రీ తెల్లటి టీ–షర్టు ధరించి ఉన్నారు. నిందితుడు రిచర్డ్‌ లూయిస్‌ నీలి రంగు టీ–షర్ట్‌ «ధరించి ఉన్నాడు. వారిద్దరూ తీవ్రంగా వాగ్వాదం చేసుకోవడం వీడియోలో రికార్డయింది.

ఈ క్రమంలో నిందితుడు రిచర్డ్‌ లూయిస్‌.. హేమంత్‌ శాంతిలాల్‌ మిస్త్రీ ముఖంపై గట్టిగా కొట్టాడు. దీంతో 59 ఏళ్ల హేమంత్‌ నేలపై కుప్పకూలి పోయాడు. రాత్రి 10:00 గంటల ప్రాంతంలో పోలీసులు స్పందించి అపస్మారక స్థితిలో పడి ఉన్న హేమంత్‌ ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ జూన్‌ 23 సాయంత్రం 7:40 గంటలకు మరణించాడు. తీవ్ర గాయాలే ఆయన మృతికి కారణమని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు.

కాగా నిందితుడు రిచర్డ్‌ లూయిస్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు మెరిడియన్‌ అవెన్యూలోని 1900 బ్లాక్‌లో ఉన్న ఒక హోటల్‌ లో పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఓక్లహోమా కౌంటీ జైలులో ఉన్నాడు. తీవ్రమైన దాడి, హత్య ఆరోపణలను అతడు ఎదుర్కొంటున్నాడు.

Tags:    

Similar News