కెనడాతో నెలకొన్న దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో గత నెలలో నిలిపివేసిన వీసా సర్వీసుల్లో కొన్నింటిని భారత్ పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒట్టావాలోని భారత హై కమిషన్ వెల్లడించింది. ఆ సంగతి అలా ఉంటే... విద్యార్థి వీసా మోసాన్ని ఎదుర్కోవడానికి, అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడడానికి అంటూ.. కెనడా కీలక చర్యలకు ఉపక్రమించింది.
అవును... స్టూడెంట్స్ వీసాల్లో మోసాలను అరికట్టడానికి కెనడా కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మోసపూరిత అంగీకార పత్రలతో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులకు సంబంధించిన ఉన్నత స్థాయి కేసుకు ప్రతిస్పందనగా, డిసెంబర్ 1 - 2023 నుంచి ప్రారంభించేందుకు కొత్త ధృవీకరణ ప్రక్రియను అమలు చేస్తోంది.
ఈ విధానంలో భాగంగా... కెనడియన్ సంస్థలు ప్రతి దరఖాస్తుదారు అంగీకారపత్రాన్ని ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజెస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (ఐ.ఆర్.సీ.సీ)తో నేరుగా ధృవీకరించవలసి ఉంటుంది. ఈ ధృవీకరణ ప్రక్రియ ద్వారా ఏడాది ప్రారంభంలో విద్యార్థులను ప్రభావితం చేసిన మోసాన్ని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ విషయంలో తమకు మరో ఉద్దేశ్యం ఏదీ లేదని కెనడా అధికారులు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... దేశానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని ఈ సందర్భంగా కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ ఉద్ఘాటించారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కేవలం మోసపూరిత అడ్మిషన్ స్కీంల బారిన పడకుండా విద్యార్థులను రక్షించడానికి చేసే ప్రయత్నంగానే చూడాలని తెలిపారు.
గతంలో.. మోసపూరిత అడ్మిషన్ లెటర్ లపై పరిశోధనల తర్వాత, ఐ.ఆర్.సీ.సీ. కేసులను సమీక్షించడానికి కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎసే)తో కలిసి పనిచేసిందని. ఇది మోసానికి పాల్పడిన వ్యక్తులపై అభియోగాల ఫలితంగా అనేక మంది బాధిత విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారని తెలిపింది.
కొత్త ధృవీకరణ ప్రక్రియ కెనడా అంతర్జాతీయ విద్యా వ్యవస్థ యొక్క మొత్తం సమగ్రతను ప్రోత్సహించడానికి రూపొందించ బడిందని.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడే పరిశ్రమ అని తెలిపింది. దీనివల్ల సంవత్సరానికి 22 బిలియన్ల డాలర్లకు పైగా సంపద సమకూరుస్తుందని తెలిపింది. ఇదే సమయంలో 2,00,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఇది మద్దతు ఇస్తుందని కెనడా సర్కార్ తెలిపింది.
ఫైనల్ గా... వీసా మోసాన్ని పరిష్కరించడం ద్వారా అర్హత కలిగిన విద్యార్థులను ఆకర్షించడం ద్వారా, కెనడా అంతర్జాతీయ విద్యార్థులకు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానంగా తన హోదాను కొనసాగిస్తూనే తన ఆర్థిక వ్యవస్థ, విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కెనడా పునరుద్ఘాటించింది.
ఈ లెక్కన... డిసెంబరు 1, 2023 నుండి, అన్ని పోస్ట్-సెకండరీ నియమించబడిన లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్ లు (డీ.ఎల్.ఐ) స్టడీ పర్మిట్ జారీ చేయడానికి ముందు కొత్త వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా ప్రతి దరఖాస్తుదారు యొక్క అంగీకార పత్రాన్ని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ తో ధృవీకరించాల్సి ఉంటుందన్నమాట!