కెనడాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?
ఈ వారం రోజుల్లో ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదాల్లో అమెరికాలో మృతి చెందగా.. కెనడాలోని ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.
ఉన్నత చదువుల కోసమో, ఉజ్వల భవిష్యత్తూ కోసమో విదేశాలకు వెళ్లి వివిధ కారణాలతో, పలు ప్రమాదాలతో మృతి చెందుతున్న తెలుగు విద్యార్థులకు చెందిన వార్తలు తీవ్ర ఆందోళన సృష్టిస్తున్నాయి! ఈ వారం రోజుల్లో ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదాల్లో అమెరికాలో మృతి చెందగా.. కెనడాలోని ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ఉన్నత చదువుల కోసమని కెనడా దేశానికి వెళ్లిన విశాఖలోని గాజువాకకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఫణికుమార్ (33) ఇటీవల ఎంబీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఎంఎస్ చదవడంకోసం ఈ ఏడాది ఆగస్టు లో కెనడాలోని కాల్గరీ నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్టా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. మిత్రులతో కలిసి ఉంటున్నారు!
ఈ క్రమంలో ఈ నెల 14న తండ్రి నాగ ప్రసాద్ కు ఫణికుమార్ రూంమేట్ ఒకరు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా... మీ కుమారుడు ఫణి నిద్రలోనే చనిపోయాడని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారట. దీంతో... తీవ్ర ఆందోళన చెందిన ఫణికుమార్ తల్లితండ్రులు నాగప్రసాద్, గీతాబాయితో పాటు కుటుంబ సభ్యులు వెళ్లి స్థానిక ఎమ్మెల్యేను కలిశారు.
ఈ మేరకు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఆయన వెంటనే జిల్ల కలెక్టర్ కు, విశాఖ ఎంపీకి పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం అక్కడున్న అధికారులతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే... ఫణి మృతికి నిద్రలో వచ్చిన గుండెపోటు కారణమా.. లేక, మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సమయంలో... ఫణికుమార్ కు సంబంధించిన ల్యాప్ టాప్, పాస్ పోర్టు, సెల్ ఫోన్ మొదలైన వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు..దర్యాప్తు మొదలుపెట్టారని అంటున్నారు!