నాడు తులసీ గబ్బార్డ్ - నేడు సుహాస్... అమెరికా చట్టసభల్లో భగవద్గీతపై ప్రమాణం!

అవును.. జనవరి 2013లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి హిందూ అమెరికన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-08 05:06 GMT

అమెరికా, లండన్ వంటి దేశాల్లోని చట్టసభలకు ఎన్నికైన భారత సంతతి నేతలు హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేసిన సందర్భాలు గతంలో జరిగిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా.. 2013లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఈ సమయంలో తాజాగా సుహాస్ కూడా అలానే చేశారు.


అవును.. జనవరి 2013లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి హిందూ అమెరికన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. యూఎస్ లోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతం నుంచి కాంగ్రెస్ చట్టసభకు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం భగవద్గీతపై ప్రమాణం చేశారు.


ఈ దృశ్యాన్ని సుహాస్ సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు వీక్షించారు. ఇదే సమయంలో... అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన మరో ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి భగవద్గీత నుంచి ఓ భాగాన్ని చదివి వినిపించారు.

కాగా... 2024 జూలైలో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎంపికైన వారిలో ఒకరైన శివానీ రాజా ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

ఎవరీ సుహాస్ సుబ్రహ్మణ్యం?:

గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో విజయం సాధించిన వారిలో భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రహ్మణ్యం ఒకరు. ఈయన వర్జీనియా 10వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.

ఈయన గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా హయాంలో టెక్ పాలసీ అడ్వైజర్ గా పనిచేశారు. 2020లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సుహాస్.. వర్జీనియా సెనెట్ కు ఎన్నికయ్యారు.

Tags:    

Similar News