లండన్ లో రోడ్డు ప్రమాదం... తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి!
తాజాగా లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందారు.
విదేశాల్లో వివిధ ప్రమాదాల్లో మృతి చెందుతున్న భారతీయులు, అందునా తెలుగువారి జాబితాలో మరో వ్యక్తి చేరారనే విషాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందారు. డివైడర్ ను కారు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని అంటున్నారు.
అవును... లండన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన 32 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పి చిరంజీవి మృతి చెందారు. చిరంజీవి ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను బలంగా ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ఘటన జరిగిందని అంటున్నారు.
ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు నివేదించారు. మరోపక్క ఆ వాహనంలో ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయని.. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారని అంటున్నారు. ఈ సంఘటనతో బూదవాడ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైందని అంటున్నారు.
ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోపక్క ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని అంటున్నారు.