లైంగిక వేధింపులు.. భారతీయుడి అరెస్టు!

కెనడాలో వరుసగా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక భారతీయుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు

Update: 2024-07-12 09:41 GMT

కెనడాలో వరుసగా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక భారతీయుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి పలువురు మహిళలతోపాటు మైనర్లను అసభ్యంగా తాకడం, లైంగికంగా వేధించడం వంటివి చేస్తున్నాడనే అభియోగాలు నమోదయ్యాయి.

కెనడాలోని న్యూ బ్రున్స్‌ విక్‌ ప్రావిన్స్‌ లోని మోంక్టన్‌ నగరంలో ఉన్న వాటర్‌ పార్క్‌లో మహిళలపై నిందితుడు వరుస లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో పలువురు మైనర్లు కూడా ఉన్నారు.

25 ఏళ్ల భారతీయ వ్యక్తి కెనడాలోని నోవా స్కోటియాలోని హాలిఫాక్స్‌ లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు జూలై 7న మోంక్టన్‌ లోని పబ్లిక్‌ వాటర్‌ పార్క్‌ లో సమూహాల్లో చేరి మహిళలను, మైనర్‌ బాలికలను అసభ్యంగా తాకడం, లైంగికంగా వేధించడం వంటివాటికి పాల్పడుతుండటంతో నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వాటర్‌ పార్క్‌ లో పన్నెండు మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించారు. బాధితుల్లో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు కూడా ఉన్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో వాటర్‌ పార్కులోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అతడు తన తదుపరి విచారణకు మోంక్టన్‌ ప్రావిన్షియల్‌ కోర్టులో హాజరు కావాల్సి ఉంది.

ఈలోగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాధితులు తమకు అందజేయాలని పోలీసులు కోరారు. ఇన్నాళ్లూ భయంతో లేదా ఇతర కారణాలతో బయటపెట్టలేనివారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.

అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడాలని పోలీసులు సూచించారు, జూలై 7న వాటర్‌ పార్క్‌ కు వెళ్లిన పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలని.. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారో, లేదో కనుక్కోవాలని కోరారు. వారిపై ఏవైనా లైంగిక వేధింపులు జరిగి ఉంటే తమను సంప్రదించాలన్నారు.

కాగా నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. అయితే అతడిని వాటర్‌ పార్క్‌ వద్ద అరెస్టు చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మైనర్‌ బాలికల్లో ఒకరి తల్లి అతడిని పోలీసులు అరెస్టు చేస్తున్న ఫొటోలను తన ఫేస్‌ బుక్‌ గ్రూపులో పోస్టు చేసింది. తద్వారా పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరోవైపు నిందితుడిపై కెనడాలోని భారతీయులు మండిపడుతున్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయని.. ఇప్పుడితడు చేసిన పాడు పనితో దేశం పరువుపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News