యూఎస్ లో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ యువకుడు

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి వేర్వేరు కారణాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది.

Update: 2024-07-29 05:05 GMT

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి వేర్వేరు కారణాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక కుర్రాడు ఈతకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత శనివారం ఈ విషాద ఉదంతం అమెరికాలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా బయటకు వచ్చింది. తాజాగా అతడి డెడ్ బాడీ హైదరాబాద్ కు చేరుకుంది. అనంతరం సొంతూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన కొడుకు గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ పేరెంట్స్ కు ఈ విషాదం అశనిపాతంగా మారింది.

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి సమంత దంపతులు పాతికేళ్ల క్రితం కాటేదాన్ కు వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు.. ఒక కొడుకు అక్షిత్ రెడ్డి (26) ఉన్నారు. గోపాల్ రెడ్డి డీసీఎం డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు చేసిన ఆయన.. మూడేళ్ల క్రితం కొడుకును ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపారు.

అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన అతను.. చికాగోలో జాబ్ చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో కొడుకు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. డిసెంబరులో అతని పెళ్లి చేయాలని ఆ కుటుంబం భావించింది. ఇదిలా ఉంటే.. గత శనివారం స్నేహితులతో కలిసి అక్షిత్ రెడ్డి చికాగోలోని లేక్ మిసిగన్ లో ఈతకు వెళ్లాడు. ఒక ఒడ్డు కొస నుంచి మధ్యలో ఉన్న రాయి వరకు చేరుకోవాలన్న లక్ష్యంతో స్నేహితుడితో కలిసి కొలనులోకి దిగాడు.

స్నేహితుడు కొలను మధ్యలో ఉన్న రాయిని చేరుకోగా.. అక్షిత్ రెడ్డి మాత్రం మధ్యలోనే అలిసిపోయాడు. ముందుకు వెళ్లలేక.. వెనక్కి వస్తూ చెరువులో మునిగిపోయాడు. మరోవైపు రాయి వరకు చేరుకొని తిరిగి వచ్చే క్రమంలో అక్షిత్ రెడ్డి స్నేహితుడు మునిగిపోగా.. స్థానికులు గుర్తించి అతడ్ని కాపాడారు. గల్లంతైన అక్షిత్ రెడ్డిని పోలీసులు వెతికి అతడి డెడ్ బాడీని వెలికితీశారు. అనంతరం శనివారానికి అక్షిత్ రెడ్డి బాడీ హైదరాబాద్ లోని కాటేదాన్ కు చేరుకోగా.. ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియల్ని పూర్తి చేశారు. ఎదిగి వచ్చిన కొడుకు అర్థాంతరంగా తమను విడిచి వెళ్లిపోయిన వైనంపై అతడి తల్లిదండ్రుల ఆవేదన పట్టలేనిదిగా మారింది. చూపరుల్ని సైతం కన్నీళ్లను పెట్టిస్తోంది.

Tags:    

Similar News