యూఎస్ లోని విద్యావంతుల జాబితాలో భారతీయుల ప్లేస్ ఇదే!

ఈ నేపథ్యంలో అక్కడున్న విద్యావంతులైన వలసదారుల్లోనూ భారతీయులే టాప్ అంట.

Update: 2024-09-25 05:28 GMT

ప్రపంచ దేశాలను శాసించే సత్త ఉన్న అగ్రరాజ్యం అమెరికాలోని అన్ని రంగాల్లోనూ భారతీయుల పాత్ర అత్యంత కీలకంగా ఉందని చెబుతుంటారు. ప్రధానంగా టెక్నాలజీ నుంచి వ్యాపారం వరకూ.. ఆతిథ్య రంగం నుంచి అంతరిక్ష రంగం వరకూ భారతీయులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడున్న విద్యావంతులైన వలసదారుల్లోనూ భారతీయులే టాప్ అంట.

అవును... అగ్రరాజ్యంలో భారతీయుల పాత్ర అన్ని రంగాల్లోనూ కీలకంగా ఉందని చెబుతూ ప్రవాస భారతీయులు, భారత సంతతి వారూ ఆ దేశానికి అందిస్తున్న సేవలపై ఇటీవల "ఇండియాస్పోరా" అనే సంస్థ ఓ కొత్త నివేదికను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఎంపీఐ) ఓ ఆసక్తికర విశ్లేషణ తెరపైకి తెచ్చింది.

ఇందులో భాగంగా... అమెరికన్ వర్క్ ఫోర్స్ ను రూపొందించే విద్యావంతులైన వలసదారుల్లో భారతీయులే ముందంజలో ఉన్నారని ఎంపీఐ తాజా విశ్లేషణలో వెళ్లడించింది. ఇందులో భాగంగా... 2018 - 22 మధ్య యూఎస్ కు వచ్చిన వలసదారుల్లో సుమారు 48% మంది కాలేజ్ డిగ్రీని కలిగి ఉన్నారని తెలిపింది.

ఇదే సమయంలో సుమారు 2 మిలియన్ మంది డిగ్రీ హోల్డర్స్ లేదా.. యూఎస్ లోని మొత్తం విద్యావంతుల్లైన వలస జనాభాలో సుమారు 14% మందితో భారతదేశం ప్రత్యేకంగా నిలుస్తుందని ఎంపీఐ తన నివేదికలో వెళ్లడించింది. ఈ విషయంలో భారత్ తర్వాత స్థానంలో 1.1 మిలియన్ (7.9%) మంది విద్యావంతులైన వలసదారులతో చైనా రెండో ప్లేస్ లో ఉంది.

ఈ క్రమంలోనే 2022నాటికి అమెరికాలోని మొత్తం వలసదారుల్లో 35% మంది బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువును కలిగి ఉన్నారని ఎంపీఐ నివేదించింది. ఇదే సమయంలో... యూఎస్ లో జన్మించిన గ్రాడ్యుయేట్లలో 11% మందితో పోలిస్తే.. వలస ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లులేదా డాక్టోరల్ డిగ్రీలను కలిగి ఉన్నవారు 15% మంది అని నివేదిక స్పష్టం చేసింది.

ఇక, విద్యావంతులైన వలసదారులు ఎక్కువగా మేనేజ్మెంట్ (16%), కంప్యూటర్ సైన్స్ (13%), హెల్త్ కేర్ (11%), బిజినెస్ (10%), విద్య (9%) వంటి నైపుణ్యం కలిగిన వృత్తుల్లో పని చేస్తారని.. ముఖ్యంగా అమెరికాలోని కంప్యూటర్ హార్డ్ వేర్ ఇంజినీర్లలో 44 శాతం మంది, వైద్యుల్లో 29 శాంతం మంది వలసదారులే అని తాజాగా నివేదిక వెళ్లడించింది.

ఇదే క్రమంలో అమెరికాలో విద్యావంతులైన వలసదారులకు ఆతిథ్యం ఇవ్వడంలో కాలిఫోర్నియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ సుమారు 3.1 మిలియన్ల మంది విద్యావంతులు ఉన్నారు. ఇదే సమయంలో... ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్ లలోనూ వీరి సంఖ్య గణనీయంగా ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం విద్యావంతులైన వలస జనాభా 51% మంది ఉండటం గమనార్హం.

యూఎస్ లోని విద్యావంతులైన వలసదారుల టాప్ 5 దేశాలు:

భారతదేశం - 20,38,176 (14.4%)

చైనా - 11,18,166 (7.9%)

ఫిలిప్పిన్స్ - 9,76,626 (6.9%)

మెక్సికో - 8,91,702 (6.3%)

సౌత్ కొరియా - 5,52,006 (3.9%)

Tags:    

Similar News