యూకేలో దారుణం.. ఈసారి ఇద్దరు తెలుగు విద్యార్థులు!
ఇప్పటికే అగ్ర రాజ్యం అమెరికాలో పలువురు భారతీయ విద్యార్థులు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ఇంకొందరు హత్యకు గురయ్యారు
ఈ ఏడాది విదేశాల్లోని భారతీయులకు అసలు కలిసి రావడం లేదు. ఇప్పటికే అగ్ర రాజ్యం అమెరికాలో పలువురు భారతీయ విద్యార్థులు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ఇంకొందరు హత్యకు గురయ్యారు.
ఈ దారుణాలు ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. ఇప్పుడు యూకే వంతు వచ్చింది. యునైటెడ్ కింగ్ డమ్ లోని స్కాట్లాండ్ లో విద్యనభ్యసిస్తున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఏప్రిల్ 17న సాయంత్రం జరిగింది. స్కాట్లాండ్ లోని బ్లెయిర్ ఆథోల్ సమీపంలో ఉన్న లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం చూడటానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు జలపాతంలో మునిగి మరణించారు. ఈ విషయాన్ని స్కాట్ లాండ్ పోలీసులు వెల్లడించారు.
మృతి చెందిన విద్యార్థులను జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22)గా గుర్తించారు. ఏప్రిల్ 17 సాయంత్రం 7 గంటలకు పెర్త్ షైర్ లోని బ్లెయిర్ ఆఫ్ అథోల్ సమీపంలోని లిన్ ఆఫ్ తుమ్మెల్ వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది, స్నేహితుల బృందంతో కలిసి వెళ్లిన జితేంద్రనాథ్, చాణక్య జలపాతంలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఇద్దరు విద్యార్థులు జలపాతంలో పడిపోవడంతో వారి స్నేహితులు పోలీసులకు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ విభాగానికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ విభాగాలు సుశిక్షితులైన సిబ్బంది, పడవలను ఘటనా స్థలికి పంపారు.
ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది రంగంలోకి దిగి నీటిలో పడిపోయిన జితేంద్రనాథ్. చాణక్యలను వెలికితీసింది. అయితే అప్పటికే వారిద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అనుమానాస్పద కారణాలు అయితే ఏవీ లేవని చెబుతున్నారు. వారంతటే వారే జలపాతంలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారని అంటున్నారు.
మరోవైపు ఇద్దరు విద్యార్థుల మృతిని లండన్ లోని భారత్ హైకమిషన్ ధ్రువీకరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు దురదృష్టకర ఘటనలో మృత్యువాత పడ్డారు అని లండన్ లోని భారత హైకమిషన్ వెల్లడించింది.
ఎడిన్ బర్గ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతోందని భారత హైకమిషన్ తెలిపింది. ఇప్పటికే ఒక కాన్సులర్ అధికారి మృతి చెందిన ఒక విద్యార్థికి చెందిన బంధువును కలిశారని వెల్లడించింది.
మృతదేహాలకు ఏప్రిల్ 19న పోస్టుమార్టం జరిపాక స్వదేశానికి పంపుతామని భారత్ హైకమిషన్ తెలిపింది. మరోవైపు విద్యార్థులు చదువుతున్న డూండీ విశ్వవిద్యాలయం కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతదేహాలను భారత్ కు తరలించడానికి అవసరమైన సహాయం చేస్తామని తెలిపింది.