భారతీయ టెకీలకు శుభవార్త!

ఈ మేరకు అమెరికాలో జన్మించిన టెకీలు వేసిన పిటిషన్‌ ను కోర్టు తోసిపుచ్చింది.

Update: 2024-08-07 09:07 GMT

అమెరికాలో ఉన్న భారత టెకీలకు శుభవార్త. హెచ్‌1బీ వీసా కింద అమెరికాలో ఉన్న టెకీల భార్యలు/భర్తలు పనిచేసుకోవడానికి ఆ దేశం అనుమతినిచ్చింది. ఈ మేరకు అప్పీల్‌ కోర్టు తన తీర్పును వెలువరించింది. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా పరిధిలో హెచ్‌1బీ వీసాకు సంబంధించి ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్‌.. టెకీలు, వారి జీవిత భాగస్వాములకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు అమెరికాలో జన్మించిన టెకీలు వేసిన పిటిషన్‌ ను కోర్టు తోసిపుచ్చింది. అమెరికాలో ఉద్యోగాలను కాపాడాలని.. వాటిని అమెరికన్లకే కేటాయించాలని ఆ దేశ టెకీలు.. ‘సేవ్‌ జాబ్స్‌ అమెరికా’ పేరిట ఒక గ్రూపుగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హెచ్‌1బీ వీసా కింద అమెరికాలో ఉన్న విదేశీ టెకీల భార్యలు/భర్తలు అమెరికాలో ఉద్యోగం చేయకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ ను కోర్టు తోసిపుచ్చింది. బరాక్‌ ఒబమా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన రూల్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. భారతీయ టెకీల భార్యలు/భర్తలు సైతం అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని వెల్లడించింది.

బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ (ఈఏ ) ప్రవేశపెట్టిన రూల్‌ ప్రకారం.. హెచ్‌1బీ వీసా హోల్డర్‌ల జీవిత భాగస్వాములు అమెరికాలో పనిచేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో హెచ్‌1బీ వీసాదారులకు వ్యతిరేకంగా సేవ్‌ జాబ్స్‌ అమెరికా గ్రూప్‌ కోర్టును ఆశ్రయించింది. ఒబామా కాలంలో తీసుకొచ్చిన రూల్‌ అమెరికాలో ఉద్యోగాలకు ముప్పు కలిగిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే న్యాయస్థానం ఈ రూల్‌ ను సమర్థించింది. డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగానికి ఈ రూల్‌ ను అమలు చేయడానికి అధికారం ఉందని పేర్కొంది,

కాగా ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలు.. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటివి ఈ రూల్‌ కు గతంలోనే మద్దతు ఇచ్చాయి. మంచి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను నియమించుకుంటే తమకే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టవంతం కావడానికి కూడా ఉపకరిస్తాయని పేర్కొన్నాయి.

హెచ్‌1బీ వీసాదారులను శాశ్వత నివాస హోదా పొందేలా ప్రోత్సహించడంతోపాటు వారి జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్‌4 వీసాదారులకు కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశమిస్తే టెక్‌ పరిశ్రమల్లో వినూత్న ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. అంతేకాకుండా పోటీతత్వం ఏర్పడుతుందని పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News