కువైట్ లో భారీ ఫైర్ యాక్సిడెంట్.. మరణించిన 49 మందిలో మనోళ్లే అత్యధికం!

వీరితో పాటు తమిళనాడు.. ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు ఉన్నట్లుగా వెల్లడైంది.

Update: 2024-06-13 05:29 GMT

ఎడారి దేశం కువైట్ లో అనూహ్య ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయ కార్మికులు నివాసం ఉండే అపార్టుమెంట్ లో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణాలు పోయాయి. 49 మంది ప్రాణాలు తీసిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 42 మంది భారతీయులే. ఇందులో కేరళ వాసులు 21 మంది ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

వీరితో పాటు తమిళనాడు.. ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు ఉన్నట్లుగా వెల్లడైంది. మిగిలిన మృతుల్లో పాకిస్థాన్.. ఫిలిప్పీన్స్.. ఈజిప్టు.. నేపాల్ జాతీయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. వంట గదిలో చెలరేగిన మంటల కారణంగా ఈ ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు మంచి నిద్రలో ఉన్న వేళలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకోవటంతో ప్రాణ నష్టం భారీగా ఉంది.

కువైట్ లోని మంగాప్ లో ఉన్న అల్ మంగాఫ్ అనే ఆరు అంతస్తుల భవనాన్ని ఎన్ బీటీసీ అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. అందులో 195 మంది కార్మికులు ఉంటున్నారు. వారిలో ఎక్కువమంది భారతీయులు. అందునా కేరళ.. తమిళనాడు.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే. ఉదయం 4.30 గంటల వేళలో భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించగా.. గంటన్నర తర్వాత అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఐదు ఫైరింజన్లు రావటం గమనార్హం.

సహాయక చర్యల్లో భాగంగా పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. కువైట్ హోం మంత్రిషేక్ ఫహద్ అల్ యూసుఫ్ అల్ సబా ఘటనాస్థలానికి చేరుకొని మరణించిన వారి సంఖ్యను ద్రువీకరించారు. భవన యజమానితోపాటు.. ఈ ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు. ఘటనకు బాద్యుల్ని చేసతూ పలువురు మున్సిపల్ అధికారుల్ని సైతం సస్పెండ్ చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా 20 నుంచి 50 ఏళ్ల వయసున్న వారుగా చెబుతున్నారు. కువైట్ లో దాదాపు 9 లక్షల మంది భారతీయ కార్మికులు నివసిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రివ్యూ చేపట్టారు. మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఘోర ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి ప్రకటించిన మరింత ఎక్కువగా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలకు.. సహాయక చర్యల సమాచారం కోసం భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయక నంబర్ ను ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలకు +965 65505246 నంబరును సంప్రదిస్తే మరిన్నివివరాలు తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

Tags:    

Similar News