18 అమెరికా నిఘా సంస్థల పర్యవేక్షకురాలు.. ఎవరీ తులసీ గబ్బార్డ్?

ఈ అత్యంత కీలక పదవికి అమెరికా కాంగ్రెస్‌ లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉండడంతో తులసి నియామకానికి తేలిగ్గా ఆమోదం లభించడం ఖాయం.

Update: 2024-11-15 19:30 GMT

తులసీ గబ్బార్డ్.. అమెరికాలో కొత్తగా ఏర్పడనున్న ట్రంప్‌ ప్రభుత్వంలో కీలక వ్యక్తి.. పేరు వింటే భారతీయ మూలాలున్నట్లుగా కనిపిస్తోంది కదూ..? ఔను ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తే. ఈమె ఒకటీ రెండు కాదు.. 18 నిఘా సంస్థల పర్యవేక్షకురాలు కానున్నారు. పాకిస్థాన్ కు దడ పుట్టిస్తున్న ఈమె నియామకం.. భారత్ కు మాత్రం పరవశం కలిగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్ష కార్యవర్గంలో నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ అధిపతి (ఎన్ఐ) కానున్న తులసీ.. ఈ పదవిని అధిష్ఠించిన తొలి హిందువు. అంతేకాదు.. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలనేది తులసీ సిద్ధాంతం అని తెలుస్తోంది.

డీఎన్ఐ..

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. అలాంటి దేశానికి నిఘా వ్యవస్థ కీలకం. మొత్తం 18 నిఘా సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటిలిజెన్స్ (డీఎన్‌ఐ) హోదాలో తులసి పర్యవేక్షకురాలు. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా పసిగట్టే వ్యవస్థ ఈ నిఘా సంస్థల సొంతం. సీఐఏ అధిపతి కూడా డీఎన్ఐ డైరెక్టరేట్ (తులసీ)కే రిపోర్ట్ చేస్తారు. కాగా, నిఘా సమాచారాన్ని క్రోడీకరించి రోజువారీ కీలక సమాచారాన్ని నేరుగా అధ్యక్షుడికి వెల్లడించడం డీఎన్ఐ విధి. ఇది ఏర్పడిన సందర్భం ఏమిటో తెలుసా..? అమెరికా చరిత్రలో అత్యంత దుర్దినంగా నిలిచే 9/11 దాడులు. దీని తర్వాత ఏర్పడిన కమిషన్‌ సూచనల మేరకు డీఎన్ఐని నెలకొల్పారు. ఈ అత్యంత కీలక పదవికి అమెరికా కాంగ్రెస్‌ లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉండడంతో తులసి నియామకానికి తేలిగ్గా ఆమోదం లభించడం ఖాయం.

భారత్ అంటే ప్రేమ..

పూర్తిగా అమెరికన్ అయినప్పటికీ.. తన మూలాలున్న భారత్ ను తులసి బాగా ఇష్టపడతారు. అది ఎలాగంటే.. తులసీ భారతీయ మూలాలున్న వ్యక్తిగా బయటపడేంత. 2012లో తాను ఇండియన్ ను కాదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, జమ్మకశ్మీర్‌ లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తులసి పలు సందర్భాల్లో తప్పుపట్టారు. పుల్వామా దాడి అనంతరం సంతాపం తెలిపారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దని పాక్ ను హెచ్చరించారు.

తులసీ 1981లో అమెరికాలోని సమోవాలో పుట్టారు. వీరి కుటుంబం హవాయిలో స్థిరపడింది. తండ్రి మైక్‌ గబ్బార్డ్‌ ఆ రాష్ట్ర సెనెటర్‌. తులసీ తల్లి కరోల్‌ పోర్టర్‌ గబ్బార్డ్‌. తులసి చిన్నప్పుడే ఆమె తల్లి హిందూ మతం స్వీకరించారు. కుమారులకు భక్తి, జై, ఆర్యన్‌ అని, కుమార్తెలకు తులసి, వృందావన్‌ అని పేర్లు పెట్టడం విశేషం.

21 ఏళ్ల వయసులో.. 2002లో తులసి హవాయి రాష్ట్ర చట్టసభకు ఎన్నికవడం విశేషం. 2004-05లో ఇరాక్‌ యుద్ధంలో మెడికల్‌ యూనిట్‌ లో పనిచేశారు. 2012లో తులసి హవాయి నుంచి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ కు ఎన్నికయ్యారు. భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసి సభలో అడుగుపెట్టడం మరింత సంచలనం.

Tags:    

Similar News