యూకేలో కొత్త వీసా రూల్స్‌.. ఇండియన్స్ పై ఎఫెక్ట్?

ఉన్నత విద్యకోసం భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడాతోపాటు బ్రిటన్‌ పై భారీ సంఖ్యలో ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే.

Update: 2023-08-18 04:53 GMT

ఉన్నత విద్యకోసం భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడాతోపాటు బ్రిటన్‌ పై భారీ సంఖ్యలో ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల యూకే యూనివర్సిటీల్లో చదువుతోన్న విద్యార్థులు, లేదా.. అక్కడ చదివేందుకు ప్లాన్ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులకు సంబంధించి బ్రిటన్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.

అవును.. బ్రిటన్ ప్రభుత్వం కొత్త వీసా రూల్స్ తీసుకొచ్చింది. దీంతో భారతీయ విద్యార్థులపై ఆ కొత్త రూల్స్ ప్రభావం ఎంత ఉండొచ్చనే చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన వివరాలు.. సందేహాలకు సంబంధించిన సమాధానాలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వివరణ ఇచ్చారు!

బ్రిటన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వీసా నిబంధనల ప్రకారం.. చదువు పూర్తయ్యేంత వరకు అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసా నుంచి ఉద్యోగ వీసాకు మారలేరు. జులై 17 - 2023 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని మంత్రి వివరించారు.

బ్రిటన్‌ లో చదువుతున్న లక్షల మంది విద్యార్థుల్లో అనేకమంది తమ ఆర్థిక అవసరాల కోసం పార్ట్‌-టైం ఉద్యోగం చేస్తున్నారు. భవిష్యత్తులో కొత్త వీసా నిబంధనలు వారిపై ప్రభావం చూపిస్తాయని భారత ప్రభుత్వం చెబుతోంది.

ఇదే సమయంలో కొత్త రూల్స్ ప్రకారం... పరిశోధన ప్రోగ్రామ్‌ గా గుర్తించిన పీజీ కోర్సులో నమోదైతే తప్ప.. తమపై ఆధారపడిన వారిని తీసుకువచ్చేందుకు అంతర్జాతీయ విద్యార్థులకు అనుమతి లేదు. జనవరి 1 - 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుందని భారత ప్రభుత్వం పేర్కొంది.

దీంతో... ఇరు దేశాల పౌరులు, విద్యార్థులు, ఉద్యోగుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే క్రమంలో ఎదురయ్యే అన్ని సమస్యలపైనా బ్రిటిష్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని భారత ప్రభుత్వం వెల్లడించింది.

కాగా... 2022లో ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌ వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 1.39లక్షలన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కొత్త వీసా రూల్స్‌ అందరు విదేశీ విద్యార్థులపైనా ప్రభావం చూపిస్తాయని భారత ప్రభుత్వం తెలిపింది!

Tags:    

Similar News