బర్త్ డే రోజు గదిలో శవమై... ఫిలిప్పీన్స్ లో తెలుగు వైద్య విద్యార్థినికి ఏమైంది?
విదేశాల్లో పలురకాల కారణాలతో మృతి చెందుతున్న తెలుగు విద్యార్థుల జాబితాలో మరో విద్యార్థిని చేరింది.
విదేశాల్లో పలురకాల కారణాలతో మృతి చెందుతున్న తెలుగు విద్యార్థుల జాబితాలో మరో విద్యార్థిని చేరింది. ఈ దారుణం ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకొంది. మృతి చెందిన విద్యార్థిని తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధగా చెబుతున్నారు. ఈ సమాచారంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
అవును.. ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల మృతులకు సంబంధించిన వార్తలు ఇటీవల తీవ్ర సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని రోడ్డు ప్రమాదాలు కాగా, మరికొన్ని తుపాకీ కాల్పుల ఘటనలు, ఇంకొన్ని జాత్యాహంకార హత్యలు వంటివని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన స్నిగ్ధ.. ఫిలిప్పీన్స్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అయితే.. తన పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లేసరికి.. ఆమె గదిలో శవమై కనిపించారని అంటున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఆమె తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఫిలిప్పీన్స్ దేశ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!