వైట్ హౌస్ పై దాడికి యత్నం... తెలుగు సంతతి వ్యక్తికి జైలు శిక్ష!
వైట్ హౌస్ పై దాడి కేసులో 19 ఏళ్ల తెలుగు సంతతి వ్యక్తి కందుల సాయి వర్షిత్ అప్పట్లోనే పోలీసులు అరెస్ట్ చేయగా.. నాటి నుంచి విచారణ జరుగుతోంది.
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వద్ద మే నెల 2023లో భారత సంతతికి చెందిన యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తెలుగు సంతతి వ్యక్తి కందుల సాయి వర్షిత్ ను పోలీసులు నాడే అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాజాగా అతడికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
అవును... వైట్ హౌస్ పై దాడి కేసులో 19 ఏళ్ల తెలుగు సంతతి వ్యక్తి కందుల సాయి వర్షిత్ అప్పట్లోనే పోలీసులు అరెస్ట్ చేయగా.. నాటి నుంచి విచారణ జరుగుతోంది. ఈ సమయంలో తాజాగా అతడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ మేరకు సాయి వర్షిత్ కు 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు న్యాయమూర్తి డాబ్నీ ఫ్రెడ్రిచ్ వెల్లడించారు.
వివరాళ్లోకి వెళ్తే... మే 22 - 2023 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు కందుల సాయి వర్షిత్. ఈ సమయంలో అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ రోజు రాత్రి 9:35 గంటల ప్రాంతంలో వైట్ హౌస్ వద్దకు వెళ్లి.. సైడ్ వాక్ పై ఈ ట్రక్కును నడిపాడు.
దీంతో... అక్కడ నడుచుకుంటు వెళ్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ వాహనం సైడ్ వాక్ పై రావడంతో భయంతో పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో సాయి వర్షిత్ తన వాహనాన్ని వైట్ హౌస్ నార్త్ వైపు తిప్పి.. అక్కడ భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్ ను బలంగా రెండు సార్లు ఢీకొట్టాడు.
అనంతరం ఆ అద్దె ట్రక్ నుంచి కిందకు దిగి నాజీ జెండాను చేతపట్టి నినాదాలు మొదలుపెట్టాడు. దీంతో.. ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని సజీవంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. ప్రెసిడెంట్ బైడెన్ ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ దాడికి యత్నించినట్లు తెలిపారు.
దీనికోసం అతడు సుమారు ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో... ఈ మొత్తం విషయాన్ని ఎలా ప్లాన్ చేసింది, ఎప్పటి నుంచి ప్లాన్ చేసింది, ఎందుకు ప్లాన్ చేసిందీ మొదలైన విషయాలు విచారణలో సాయివర్షిత్ వెళ్లడించి, అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి శిక్ష ఖరారైంది.