అమెరికాలో మరో దారుణం.. ఈసారీ తెలుగు విద్యార్థే!

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే అమెరికాలో వరుసగా భారతీయులు మృత్యువాత పడటం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.

Update: 2024-07-09 05:33 GMT

అమెరికాలో భారతీయుల వరుస మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. వరుసగా వివిధ ప్రమాదాల్లో లేదా హత్యలకు గురై భారతీయులు మృతి చెందుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది భారతీయులకు అసలు అచ్చిరాలేదు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే అమెరికాలో వరుసగా భారతీయులు మృత్యువాత పడటం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది ఫ్లోరిడాలోని ఇండియానా యూనివర్సిటీ పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న పిట్టల వెంకటరమణ, కృష్ణా జిల్లాకు చెందిన తల్లీకూతురు గీతాంజలి, హానిక, బాపట్ల జిల్లా విద్యార్థి ఆచంట రేవంత్, మరో తెలుగు విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రమాదాల కారణంగా తెలుగు విద్యార్థుల మరణాల కేసులు పెరుగుతుండటం బాధాకరం.

అలాంటి మరో విషాద ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ట్రైన్‌ యూనివర్శిటీకి చెందిన గద్దె సాయి సూర్య అవినాశ్‌ అనే విద్యార్థి జూలై 7వ తేదీన న్యూయార్క్‌ రాష్ట్రంలోని అల్బానీలో ఉన్న బార్బర్‌ విల్లే జలపాతంలో మునిగి మృత్యువాత పడ్డాడు.

రెన్సీలేర్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం, మీడియా నివేదికల ప్రకారం.. జలపాతంలో మునిగిన ఘటనలో సాయి సూర్య అవినాశ్‌ మరణించగా మరో వ్యక్తిని రెస్క్యూ టీం రక్షించింది.

అవినాశ్‌ జూలై 4 లాంగ్‌ వీకెండ్‌ హాలిడేస్‌ కోసం న్యూయార్క్‌ లోని బార్బర్‌ విల్లే జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లాడు. జూలై 7న దురదృష్టవశాత్తూ అతడు ఈ ఘటనలో మరణించాడు. దీంతో అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవినాశ్‌ తెలంగాణకు చెందిన విద్యార్థి.. ట్రైన్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. న్యూయార్క్‌ లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషాద ఘటన పట్ల స్పందించింది. ఈ ఘటన పట్ల సానుభూతిని వ్యక్తం చేసింది.

న్యూయార్క్‌ లోని భారత రాయబార కార్యాలయం అవినాశ్‌ భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మృతుడి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సహాయాలను అందిస్తోంది.

అమెరికాలో చదువుకోవడానికి వస్తున్న భారతీయ విద్యార్థులు కొత్త ప్రదేశాలను సందర్శించే ముందు వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. స్వీయ–అవగాహనను ఏర్పరచుకోవడం చాలా కీలకమని సూచిస్తున్నారు.

Tags:    

Similar News