అమెరికాలో తెలుగు వైద్యుడి మృతి.. ఇదొక పెద్ద మిస్టరీ!

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ప్రముఖ వైద్యుడు పేరంశెట్టి రమేశ్‌ బాబు కాల్పులకు గురై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2024-08-26 06:52 GMT

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ప్రముఖ వైద్యుడు పేరంశెట్టి రమేశ్‌ బాబు కాల్పులకు గురై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అందరికీ ఎంతో సహాయం చేస్తూ చాలా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఆయన మృతి అమెరికాలోని తెలుగు సంఘాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.

కుటుంబంతో కలిసి అమెరికాలోని టుస్కలూసాలో ఉంటున్న రమేశ్‌ బాబు ఎలా మృతి చెందారు? ఎవరు కాల్చారు? ఇది హత్యా లేక ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అనేది తెలియడం లేదు.

మొదట ఆయనను కొందరు దుండగులు కాల్చిచంపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ప్రాథమిక నివేదికలు, వైద్య పరీక్షల ఆధారంగా ఇది హత్య కాదని స్పష్టమైంది.

పేరంశెట్టి రమేశ్‌ బాబు తన ఇంట్లో ఉన్న తుపాకీని శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా అది పేలి బుల్లెట్‌ తలలోకి దూసుకుపోయి ఆయన మరణించారని ఇంకో వాదన వినిపిస్తోంది.

వ్యక్తిగత సమస్యల కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఇంకో వాదన వినిపిస్తోంది. అయితే ఇది హత్యే అనడానికి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

నెల్లూరు జిల్లా, మేనకూరుకు చెందిన డాక్టర్‌ పేరంశెట్టి రమేశ్‌ బాబు అమెరికాలో తన ఇంటి కారు పార్కింగ్‌ షెడ్‌ వద్ద గన్‌ ఫైరింగ్‌ జరగడం వల్ల మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక గుర్తు తెలియని దుండగులు హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రమేష్‌ బాబు మేనకూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్య నభ్యసించిన తర్వాత తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేశారు. అనంతరం అమెరికా వెళ్లారు. అక్కడే పీజీ మెడిసిన్‌ పూర్తి చేశారు. అమెరికాలో పలు ఆస్పత్రులు నిర్మించారు. మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వయసు 64 ఏళ్లు.

కాగా రమేశ్‌ బాబు భార్య కూడా డాక్టర్‌ వృత్తిలోనే ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం అంతా అమెరికాలోనే ఉంటున్నారు. రమేష్‌ బాబు కరోనా సమయంలో అందించిన సేవలకు ఎన్నో పురస్కారాలు పొందారు. తాను చదువుకున్న మేనకూరు ఉన్నత పాఠశాలకు గతంలో రూ.14 లక్షల విరాళం ఇచ్చారు.

తన స్వగ్రామంలో సాయిబాబా దేవాలయ నిర్మాణానికి రమేశ్‌ రూ.20 లక్షల విరాళం అందజేశారు. ఆగస్టు 15న నెల్లూరు జిల్లా నాయుడుపేటకు వచ్చారు. బంధువుల వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త బంధువుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags:    

Similar News