అగ్ర రాజ్యంలో తెలుగు జెండా రెపరెపలు!

ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం భారత్‌ నుంచి పెద్ద ఎత్తున ఏటా అమెరికాకు వెళ్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-07-08 08:36 GMT

ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం భారత్‌ నుంచి పెద్ద ఎత్తున ఏటా అమెరికాకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 5 మిలియన్లు (50 లక్షలు) దాటిపోయింది. అమెరికాకు భారీ ఎత్తున వెళ్తున్నవారిలో మన తెలుగు రాష్ట్రాలవారు కూడా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారు ఉన్నత చదువుల కోసం, ఉన్నత ఉద్యోగాల కోసం అగ్ర రాజ్యానికి పయనమవుతున్నారు.

ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని రీతిలో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016లో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 3,20,000 మంది ఉండగా 2024 నాటికి ఈ సంఖ్య 1.23 మిలియన్లకు పెరగడం విశేషం.

స్టాటిస్టికల్‌ అట్లాస్, అమెరికా జనాభా లెక్కల ప్రకారం.. ఆ దేశంలో తెలుగు మాట్లాడేవారిలో ఇటీవల అమెరికాకు వచ్చిన విద్యార్థులతోపాటు ఇప్పటికే అక్కడ నివాసం ఉంటున్న నాలుగో తరం వారు కూడా ఉన్నారు.

ఇక భారతీయ టెకీలు.. ముఖ్యంగా తెలుగు టెకీలు అత్యధికంగా ఉండే కాలిఫోర్నియాలోనే అత్యధికంగా తెలుగు భాషను మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.

కాలిఫోర్నియా తర్వాత రెండో స్థానంలో టెక్సాస్‌ నిలిచింది. ఇక్కడ లక్షన్నర మంది ఉన్నారు.

మూడో స్థానంలో న్యూజెర్సీ నిలిచింది. ఇక్కడ తెలుగు మాట్లాడేవారు 1,10,000 మంది ఉండటం విశేషం.

కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ తర్వాత ఇల్లినాయిస్‌ (83,000), వర్జీనియా (78,000), జార్జియా (52,000) వంటి రాష్ట్రాల్లో కూడా గణనీయ సంఖ్యలో తెలుగు మాట్లాడే వారున్నారు.

అమెరికాలో ఈ రాష్ట్రాలన్నింటిలోనూ తెలుగు మాట్లాడే జనాభా నాలుగు రెట్లు పెరగడం విశేషం. దీంతో అమెరికాలో అత్యధికంగా మాట్లాడే 350 భాషల్లో తెలుగు ఇప్పుడు 11వ స్థానంలోకి దూసుకొచ్చింది.

ప్రతి ఏటా అమెరికాకు 60 వేల నుంచి 70 వేల వరకు తెలుగువారు వస్తున్నారు. వీరిలో పదివేల మంది హెచ్‌1బీ వీసా హోల్డర్‌ లే.

ఎన్నో ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిపోయిన పాతతరం తెలుగువారు అక్కడ ఎంటర్‌ ప్రెన్యూర్లుగా ఉన్నారు. కాగా కొత్తతరంలో 80 శాతం మంది ఐటీ, ఫైనాన్స్‌ రంగాల్లో స్థిరపడ్డారు.

కాగా అమెరికాలో అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషగా హిందీ నిలిచింది. హిందీ తర్వాత గుజరాతీ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు భాషల తర్వాత తెలుగు మూడో స్థానంలో ఉంది.

ఇండియన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ 2024 ప్రకారం.. అమెరికాలో మొత్తం భారతీయ విద్యార్థుల్లో 12.5 శాతం మంది తెలుగు విద్యార్థులే కావడం గమనార్హం. భారతీయ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థులే అత్యధికంగా ఉన్నారు.

తెలుగుకు పెరిగిన ప్రాధాన్యతకు నిదర్శనంగా కెంట్‌ స్టేట్‌ యూనివర్శిటీ ‘విద్యార్థులకు స్వాగతం‘ అని తెలుగులో రాసి ఉన్న ఫ్లెక్సీలతో ఆహ్వానం పలకడం విశేషం.

Tags:    

Similar News